సంక్రాంతి సినిమాల జోరు మొదలైపోయింది. ఇంచుమించుగా రెండూ ఒకేసారి ప్రచార రంగంలోకి దూకబోతున్నాయి. జనవరి 1 నుంచి అటు ఖైదీ నెం.150, ఇటు గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరంగా సాగబోతున్నాయి. ప్రమోషన్లకు సెన్సార్ డేట్ నుంచే ముహూర్తం కుదిరింది. డిసెంబరు 29న ఖైదీ నెం.150 సెన్సార్ జరగబోతోంది. నిజానికి అదే రోజు గౌతమి పుత్ర శాతకర్ణి సెన్సార్ కూడా జరగాల్సింది. అయితే.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఓ కొలిక్కి రాకపోవడం వల్ల సెన్సార్ ఆలస్యం అవుతోంది. జనవరి 5న గౌతమిపుత్ర సెన్సార్ ముందుకు వెళ్లనున్నదని తెలుస్తోంది.
ప్రీ రిలీజ్ ఫంక్షన్ల విషయానికొస్తే.. ఖైదీ నెం.150 జనవరి 4న విజయవాడలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించబోతోంది. ఆల్రెడీ ఇప్పటికే ఆడియో ఫంక్షన్‌ని జరుపుకొన్న శాతకర్ణి మాత్రం ప్రీ రిలీజ్ వేడుక విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. ఆ కార్యక్రమం చేయాలా, వద్దా అనే ఆలోచనలో పడిందట. ఆడియో విడుదలకూ, సినిమా విడుదలకు మధ్యలో చాలా గ్యాప్ ఉంది కాబట్టి.. ఓ ఫంక్షన్ అయితే చేయాల్సిందే. దానికి రొటీన్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అని కాకుండా.. వేరే పేరేమైనా పెట్టాలా అనే ఆలోచనలో ఉన్నట్టు తోస్తోంది. జనవరి 8న గౌతమిపుత్ర కు సంబంధించిన ఓ ఈవెంట్‌ని నిర్వహించడం ఖాయం. అయితే ఇది ఏ స్థాయిలో అనేది తేలాల్సివుంది.