ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన గడువు ముగిసిపోయింది! యాభై రోజులు సహకరించండీ… దేశంలోని నల్లధనం అంతా బయటకి వచ్చేస్తుందని దేశ ప్రజలను ఉద్దేశించి నవంబర్ 8న ప్రధానమంత్రి చెప్పారు. పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల ఈ యాభై రోజులు మాత్రమే కష్టాలు ఉంటాయన్నారు. ఆ తరువాత, ఎలాంటి ఇబ్బందులూ ఉండవని భరోసా ఇచ్చారు. యాభై రోజుల తరువాత పరిస్థితి మారకపోతే ప్రజలు ఎలాంటి శిక్ష వేసినా తాను సిద్ధం అని భావోద్వేగాలను మేళవించి ఉపన్యసించారు. ఆ 50 రోజులూ అయిపోయాయి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం..? బ్యాంకుల్లో సొమ్ము సరిపడా ఇంకా లేదు! ఏటీఎమ్‌లు ఎనీటైమ్ మూతబడ్డ మెషీన్లు అయిపోయాయి. సరే, దేశం కోసం కొన్నాళ్లు కష్టానికి ప్రజలు ఓర్చారు అనుకుందాం. మరి, మోడీ చెప్పినట్టు నల్లధనం వెలికితీత అయిపోయినట్టా..? చెలామణిలో ఉన్న సొమ్మంతా బ్యాంకుల్లోకి వచ్చిందనే చెప్పుకోవాలి. మరి, బ్లాక్ మనీ ఏమైంది..? ఈ తాజా పరిస్థితిపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తనదైన శైలిలో కొత్త భాష్యం చెబుతున్నారు.
ప్రభుత్వం ఆశించినకంటే ఎక్కువగానే బ్యాంకుల్లోకి సొమ్ము వచ్చేసిందని అర్థమౌతోంది! ఎందుకంటే, దాదాపు ఇరవై రోజుల కిందటే రూ. 12 లక్షల కోట్లకు మించిన డిపాజిట్లు వచ్చినట్టు ఆర్.బి.ఐ. ప్రకటించింది. మొత్తం చెలామణిలో ఉన్నది రూ. 14 లక్షల కోట్లు పైచిలుకు! అంటే, ఈపాటికి మొత్తం సొమ్ము బ్యాంకుల్లోకి వచ్చేసి ఉండాలి. మరి, తాజా లెక్కల్ని ఎవ్వరూ చెప్పడం లేదు. అయితే, ఇలా బ్యాంకులకు వచ్చిన సొమ్మంతా సక్రమ సంపాదన కాకపోవచ్చని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఇప్పుడు అంటున్నారు. వీటన్నింటిపైనా తనిఖీలు ఉంటాయని చెబుతున్నారు. అంతేకాదు, నల్లధనం వెలికితీతకు డిసెంబర్ 30 చివరి గడువు కాదని చెప్పారు. ఇతర మార్గాల ద్వారా బ్లాక్‌మనీని బయటకి తీసుకొచ్చే కార్యక్రమాలు ఇంకా మొదలౌతాయని అంటున్నారు.
డిసెంబర్ 30తో దేశంలో నల్లధనం ఉండదని గతంలో ప్రధాని అన్నారు. బ్లాక్‌మనీ మీద అసలు యుద్దం ఇంకా మొదలు కాలేదని వెంకయ్య చెబుతున్నారు! చెలామణిలో ఉన్న సొమ్మంతా డిపాజిట్ల రూపంలో బ్యాంకుల్లోకి వచ్చేసింది. అంటే, ప్రభుత్వం ఆశించిన బోనస్‌ను ఆర్బీఐ ప్రకటించే అవకాశం లేదు కదా! కనీసం ఓ రెండు మూడు లక్షల కోట్ల సొమ్ము వెనక్కి రాదని అనుకున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి అలా కనిపించడం లేదు. అంటే, నల్లధనం దేశంలో లేనట్టేగా..? ఈ ప్రశ్న సామాన్యుడి నుంచి రాకముందే ప్రజల మైండ్ సెట్ ట్యూన్ చేస్తున్నారు. డిపాజిట్ అయిన సొమ్మంతా సక్రమ సంపాదన కాకపోయి ఉండొచ్చని వెంకయ్య చెబుతున్నారు.
కొండని తవ్వితే కనీసం చిట్టెలుక కూడా చిక్కినట్టు లేదు. యుద్దంలో ఓడిపోతే పోరాటాన్ని పొగుడుకోవడం తప్ప చేసేదేమీ ఉండదు! ఇకపై ఇలాంటి వ్యాఖ్యాలు ఇంకా వినాల్సి ఉంటుంది.