బీకామ్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులు ఉంటాయని తన విషయ పరిజ్ఞానాన్ని తాజాగా బయటపెట్టుకున్నారు వైకాపా ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్. గడచిన రెండు రోజులుగా ఆయన ఇంటర్వ్యూకి సంబంధించి వీడియో వైరల్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఇదే చర్చ! అయితే, ఒక చిన్న వీడియో క్లిప్ ఇంత త్వరగా వైరల్ కావడం వెనక వైకాపా ప్రయత్నం ఉందా అనే చర్చ ఇప్పుడు మొదలైంది.
ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వైకాపా ఓ కన్నేసి ఉంచిందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వారు ఏ సందర్భంలో నోరు జారినా.. దానికి సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలన్న వ్యూహంలో ఉన్నట్టు సమాచారం. నిజానికి, సోషల్ మీడియాలో వైకాపా కాస్త వీక్ అనే అభిప్రాయం గడచిన ఎన్నిక సందర్భంలో ఉండేది. ఓటమి తరువాత కూడా చాన్నాళ్లపాటు సోషల్ మీడియా గురించి కాస్త లైట్‌గానే తీసుకుంటూ వచ్చింది. ఈ ధోరణి ఈ మధ్యే మార్చుకున్నారు. ప్రతీ జిల్లా నుంచి సోషల్ మీడియాలో పార్టీ తరఫున యాక్టివ్‌గా ఉండేవారిని గుర్తించి, ట్రైనింగ్ ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి.
జలీల్ ఖాన్ కామెంట్లపై వైకాపా సోషల్ మీడియా టీమ్ వెంటనే అప్రమత్తమైనందని తెలుస్తోంది. ఆ క్లిప్పింగ్ దొరికిన వెంటనే పార్టీకి చెందినవారు భారీ ఎత్తున షేరింగులు చేయడంతో 24 గంటల్లోనే జలీల్ జనరల్ నాలెడ్జ్ ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఆ మేరకు వైకాపా సోషల్ మీడియా సాధించి విజయంగానే దీన్ని చెప్పాలి. ఈ వీడియోతోపాటు ఎన్నికల సమయంలో జలీల్ ఇచ్చిన అఫిడవిట్లో గరిష్ట విద్యార్హత మెట్రిక్యులేషన్ అని మాత్రమే ప్రకటించుకున్నారు. కానీ, ఇంటర్వ్యూలో తాను బీకామ్ చదివానని, ఫిజిక్స్, మాథ్స్ అంటే ఇష్టమని చెప్పుకున్నారు. ఆయన మెట్రిక్యులేషన్ చదువుకి సంబంధించి వివరాలకు కూడా పార్టీ సోషల్ మీడియా బాగానే ప్రచారం చేసిందని అంటున్నారు.
ఫిరాయించిన ఎమ్మెల్యేలందరిపైనా వైకాపా సోషల్ మీడియా గట్టి నిఘానే పెట్టినట్టుగా ఉంది. ఎవరు ఎక్కడ ఏమాత్రం నోరు జారినా, ఏ అంశంలో అడ్డంగా దొరికిపోయినా ఏకిపారేయడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు! జలీల్ ఖాన్ జనరల్ నాలెడ్జ్ ప్రదర్శనను వైకాపా సరిగానే వాడుకుంటోందని చెప్పాలి.