బాలకృష్ణ వందవ సినిమా, చిరంజీవి 150వ సినిమాల రిలీజ్ డేట్ దగ్గరకు వస్తోంది. దానికి తగ్గట్టుగానే ఇరువర్గాలు కూడా హీట్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. మొదటి రోజు నుంచే కలెక్షన్స్ మోత మోగాలంటే అభిమానుల్లో ఊపు తీసుకుని రావాల్సిందే. ఒక రకమైన హిస్టీరియాలాంటి సిచ్యుయేషన్లోకి వాళ్ళ ఆలోచనలు వెళ్ళిపోవాలి. మా అభిమాన హీరోనే సంక్రాంతి విజేత కావాలి, మా ఫేవరైట్ హీరో సినిమానే సంక్రాంతి హిట్‌గా నిలబడాలి అన్న ఆలోచన వాళ్ళ మస్తిష్కంలో బలంగా నిలబడిపోవాలి. అలా జరిగితే తప్ప సినిమా ఎలా ఉంది? అనేదానితో సంబంధం లేకుండా కనక వర్షం కురవదు మరి. అందుకోసమే ఓ రసవత్తరమైన డ్రామా మొదలెట్టారు.
ఆలోచనపరుడు, సౌమ్యుడు అయిన డైరెక్టర్ క్రిష్‌లాంటి వాడినోటి నుంచి కూడా ‘ఖబడ్దార్’ అన్న డైలాగ్ వచ్చిందంటే ఇక రెగ్యులర్ సినిమా వాళ్ళ మాటలకు అడ్డూ అదుపు ఏం ఉంటుంది. బాలయ్య అభిమానుల ఆవేశాన్ని పీక్స్‌కి తీసుకెళ్ళడానిికి క్రిష్ ఆవేశపూరిత మాటలు, ఖబడ్దార్ డైలాగ్ కూడా బాగానే పనికొచ్చింది. కానీ మీడియావాళ్ళతో పాటు సోషల్ మీడియా జీవులు కూడా క్రిష్ మాటలను చిరంజీవికి ఆపాదించడంతో క్రికెట్ టీం అంతమంది ఉన్న మెగా హీరోలను దూరం చేసుకోవడానికి ఏ డైరెక్టర్ కూడా ఇష్టపడడు కనుక వెంటనే ‘నా వ్యాఖ్యలు చిరంజీవిని ఉద్ధేశ్యించి కాదు’ అని క్లారిటీ ఇచ్చేశాడు. అప్పటికే ఆ ఖబడ్దార్ డైలాగ్ కాస్తా బాలకృష్ణ అభిమానులందరికీ రీచ్ అయి ఉండడంతో క్లారిఫికేషన్ ఇచ్చినప్పటికీ ప్రచారానికి వచ్చిన నష్టం లేదు.
ఓవైపు ఖబడ్దార్ ఇష్యూ కొనసాగుతుండగానే ‘కొట్టేస్తున్నాం..’ అన్న బన్నీ మాటలు హైలైట్ అయ్యాయి. అల్లు అర్జున్ మాటలను చాలా మంది వివాదాస్పదం చేసి పడేశారు. బన్నీ ఏదో తప్పు మాట మాట్లాడాడు అన్నట్టుగా చెప్పుకొచ్చారు కానీ ఈ అల్లు హీరో మాట్లాడిన మాటల్లో తప్పేమీ లేదు. ఆ మాటకొస్తే ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో బాలకృష్ణ, చంద్రబాబునాయుడు, వెంకయ్యలతో సహా హాజరైన అతిథులందరూ చెప్పిన విషయం కూడా అదేగా. ఈ సారి సంక్రాంతికి బాలకృష్ణ హిట్టు కొట్టబోతున్నాడు అన్న మాటేగా. నందమూరి వాళ్ళందరూ బాలకృష్ణ సినిమా హిట్ అంటారు. మెగా వర్గం అంతా కూడా చిరంజీవి సినిమా హిట్ అని అంటారు అందులో తప్పేముంది.
హీరోలు, డైరెక్టర్స్‌తో పాటు ఆ సినిమాలకు పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్ మాటలు ఎలా ఉన్నా కొంతమంది అభిమానులు మాత్రం ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్‌కి మరీ ఓవర్‌గా రెచ్చిపోతున్నారు. అభిమాన హీరో సినిమాని హిట్ చెయ్యాల్సిన బాధ్యత ఏదో వాళ్ళ భుజస్కందాల మీద పెట్టినట్టుగా వేరే హీరోని, ఆయన అభిమానులను ప్రత్యర్థి వర్గంగా చూస్తూ సోషల్ మీడియాలో యుద్ధాలే చేస్తున్నారు. ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టుకుంటూ నానా రచ్చ చేసిపడేస్తున్నారు. హీరోలపైన మూఢ అభిమానంతో మనుషులమన్న ఇంగితాన్ని మర్చిపోతున్నారు. స్టేజ్ పైన ఉన్నప్పుడు, మీడియా వాళ్ళ ముందు కూడా అభిమానుల గురించి హీరోలు ఓ రేంజ్లో చెప్పేస్తూ ఉంటారు. రక్తసంబంధం, సోదరులు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాంటి మాటలు చెప్తూ ఉంటారు. ఆ డ్రామాలనే నిజమని నమ్మే అమాయకపు అభిమానులు మాత్రం ఆ హీరోల పైన అభిమానంతో తోటివారితో యుద్ధాలకు దిగుతున్నారు. లేనిపోని గొడవలతో మనఃశాంతి లేకుండా చేసుకుంటూ, సాటివారిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. సోషల్ మీడియాతో పాటు బయట కూడా ఈ వాగ్వాదాలన్నీ రోజురోజుకూ పెచ్చుమీరుతూనే ఉన్నాయి. ఇక సంక్రాంతి టైంకి, సినిమా రిలీజ్‌ల రోజు ఇంకే రేంజ్లో ఉంటాయో చూడాలి. ఆల్రెడీ అభిమానుల మరణాలను, కొట్టుకోవడాలను చాలా సార్లు చూసి ఉన్నాం. ఆ సంఘనటలను గుర్తు చేసుకుని అయినా అభిమాన హీరోల సినిమాని హిట్ చేయడమే జీవితం అనే రేంజ్లో రెచ్చిపోకుండా ఉంటే బాగుంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఆ మాటలు అభిమానుల చెవికెక్కుతాయంటారా?