స్టార్ హీరోయిన్గా ఎదగాలంటే ఇది వరకు చాలా ప్రోసెస్ ఉండేది. కనీసం నాలుగేళ్లుగా కంటిన్యూస్ హిట్ కొడితే గానీ.. ‘స్టార్’ హోదా దక్కేది కాదు. అందం, అభినయం… ఈరెండింటితో కట్టిపడేసే తెలివితేటలు, కథల ఎంపికలో ఆరితేరిపోయిన అనుభవంతోనే స్టార్ కిరీటం దక్కేది. ఇప్పుడు ఇంత ప్రోసెస్ అవసరం లేదు. ఒక్కటంటే ఒక్క సినిమాతోనే స్టార్లుగా మారిపోతున్నారు. పెద్ద హీరోల దృష్టిలో పడాలంటే.. చేతిలో ఒక్క విజయం ఉంటే సరిపోతోంది. ఓ స్టార్ హీరోతో నటిస్తే చాలు, మిగిలినవాళ్లూ.. ఆ కథానాయికే కావాలంటున్నారు. దాంతో.. రాత్రికి రాత్రే కథానాయికలు ఎదిగిపోతున్నారు. వాళ్ల పతనం కూడా అంతే వేగంగా జరిగిపోతోంది. అయితే ‘స్టార్ నాయిక’ హవా మాత్రం సామాన్యమైందేం కాదు. తన వల్ల సినిమాకి గ్లామర్ వస్తుంది. బీ,సీల్లో హీరోయిన్ వల్లా టికెట్లు తెగుతుంటాయి. మరి 2016లో స్టార్ హీరోయిన్ల హవా కొనసాగిందా? వాళ్లు చేసిన మ్యాజిక్ ఏంటి? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లే ప్రయత్నం చేస్తే…?
అనుష్క కి ఈ యేడాది ఏం కలసి రాలేదు. చేసింది రెండు సినిమాలే. అవీ అతిథి పాత్రలు. సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి చిత్రాల్లో అతిథిగా మెరిసింది జేజమ్మ. ఆ రెండు సినిమాలూ విజయాలు సాధించినా… `అతిథి` కాబట్టి ఆమెకు క్రెడిట్ దక్కలేదు. సింగం 3 ఈ యేడాదే విడుదల కావాల్సింది. కానీ.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. తమన్నాకీ 2016 అచ్చి రాలేదు. ఆమె నటించిన ఊపిరి హిట్టయినా.. అందులో తమన్నా చేసిందేం లేదు. కథానాయిక ప్రాధాన్యం ఉన్న అభినేత్రి సినిమాలో నటించినా.. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో రెండడుగులు వెనక్కి వేసినట్టైంది. ఈమధ్య విశాల్‌తో కలసి నటించిన ఒక్కడొచ్చాడు విడుదలైంది. ఇందులో ఆమె పాత్ర కేవలం పాటలకు మాత్రమే పరిమితమైంది. సినిమా కూడా అట్టర్ ఫ్లాప్. కాజల్‌కి గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు రెండూ ఫ్లాప్ అవ్వడంతో కాజల్ ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. పక్కాలోకల్ అంటూ… జనతా గ్యారేజ్‌లో ఓ ఐటెమ్ సాంగ్ చేసిందంతే. ఆ పాట క్లిక్కవడం, సినిమాకి బ్లాక్ బ్లస్టర్ విజయం దక్కడం ఒక్కటే కాజల్‌కి ఊరట.
శ్రుతిహాసన్ దూకుడు 2016లో ఏమాత్రం కనిపించలేదు. ఆమె నటించిన ఒకే ఒక్క చిత్రం ప్రేమమ్. ఆ సినిమా ఓకే అనిపించుకొంది. అయితే శ్రుతిని మిస్ కాస్టింగ్ గా తేల్చేశారు విశ్లేషకులు. సమంత మాత్రమే కొంతలో కొంత మెరిసంది. జనతా గ్యారేజ్, అ,ఆ, 24 చిత్రాలు విజయవంతమయ్యాయి. అ.ఆతో పోలిస్తే మిగిలిన రెండు సినిమాల్లో సమంత పాత్ర అంతంత మాత్రమే. రకుల్‌ని కూడా స్టార్ హీరోయిన్ అని లెక్కగడితే… మిగిలినవాళ్ల కంటే తనకు బెటర్ విజయాలు దక్కాయి. నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవతో హ్యాట్రిక్ కొట్టేసింది రకుల్. గతేడాదితో పోలిస్తే 2016లో స్టార్ హీరోయిన్ల హవా బాగా తగ్గినట్టే లెక్క. కొత్తమ్మాయిలు పోటీ ఇవ్వడం, ‘స్టార్ హీరోయిన్ లేకపోయినా ఫర్వాలేదు’ అని దర్శకులు ఫిక్సయిపోతుండడంతో ఈ కథానాయికలకు అవకాశాలు అంతంత మాత్రంగానే దక్కుతున్నాయి. పైగా సమంత, అనుష్కలాంటి వాళ్లు కావాలనే కొన్ని తెలుగు సినిమాల్ని పక్కన పెట్టడం వల్ల… స్టార్ మాయాజాలం మరింత తగ్గిపోయింది.