ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన గడువు పూర్తయింది. పెద్ద నోట్ల రద్దు తరువాత 50 రోజులు సమయం ఇస్తే, నల్లదనం బయటకి తీసేస్తామనీ, కొత్త భారతాన్ని ఆవిష్కరిస్తామని నవంబర్ 8న చెప్పారు. ఆయన కోరినట్టే ప్రజలు యాభై రోజులు అవస్థలు పడ్డారు! బ్యాంకు క్యూలైన్లలో నిలబడి చస్తున్నాసరే, ఎక్కడా ఎలాంటి తిరుగుబాటూ రాలేదు. ప్రజలు తిరగబడలేదు కాబట్టి, మోడీ నిర్ణయానికి అందరూ ఆమోదం తెలిపినట్టే అని భాజపా ప్రజలు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులపై ప్రధాని మోడీ లోక్సభలో మాట్లాడలేకపోయారు. ప్రజాసభలో మాట్లాడుతా అంటూ ఆ మధ్య బహిరంగ సభల్లో ప్రజల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. తాజాగా ఈ విషయమై మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా ఉన్న నల్లధనం ఆనవాళ్లు బయటపడ్డాయని మోడీ అన్నారు.
నల్లధనం రహస్యం బట్టబయలు అయిందన్నారు. ఆదాయ పన్ను విభాగం దగ్గర ఇప్పుడు పక్కా సమాచారం ఉందనీ, ప్రజలే బ్యాంకులకు వెళ్లి స్వచ్ఛందంగా సొమ్మును డిపాజిట్ చేశారన్నారు. అవినీతిపరులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందనీ, ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని మోడీ పురనద్ఘాటించారు. నల్లధనం దాచేవారికి రోజులు అయిపోయాయంటూ మోడీ చెప్పారు.
మోడీ మాటల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే… నోట్ల రద్దుతో నల్లధనం అంతమైపోతుందని గతంలో చెప్పారు కదా! ఇప్పుడు బ్లాక్మనీ ఆనవాళ్లు దొరకాయని అంటున్నారు. ఇంత ప్రహసనం తరువాత దొరికింది ఇదేనా..? యాభై రోజుల్లోపు పరిస్థితులన్నీ చక్కబడిపోయి, నగదు కష్టాలు తీరిపోతాయన్నారు. ఇప్పుడేమో… 50 రోజుల దాటక పరిస్థితులు సాధారణ స్థితికి రావడం ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. బ్లాక్మనీ దాచుకునేవారికి రోజులు అయిపోయాయి అంటున్నారిప్పుడు. కానీ, కొన్నేళ్లుగా బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన పెద్ద మనుషులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పడం లేదు. కోట్ల కొద్దీ పన్నులను ఎగవేసివారిపై ఎలాంటి చర్యలుంటాయో వివరించడం లేదు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం ఎలా బయటితెస్తారో వ్యూహం ఊసెత్తడం లేదు.
అన్నిటికీ మించి, నోట్ల రద్దు తరువాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. వాస్తవంలో జరిగిన నష్టాన్ని ఎందుకు ప్రకటించడం లేదు..? అన్ని రంగాలనూ మళ్లీ లాభాల బాటపట్టేలా తీసుకుంటున్న చర్యల గురించి ఎందుకు మాట్లాడటం లేదు..? నోట్ల రద్దు నిర్ణయం వల్ల నలిగిపోయిందీ, చితికిపోయిందీ, నష్టపోయిందీ… అన్నీ సామాన్యుడే. ఒక్క బడా బాబు బాధపడ్డట్టు ఆనవాళ్లు ఉన్నాయా..? ఇవేవీ చాలవన్నట్టు… ఇంకా కొత్త బాంబులు వేస్తాం, ఇంకా కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ లీకులొకటి. సామాన్యుడికి భరోసాగా ఉండాల్సిన సర్కారే.. భయభ్రాంతులకు గురి చేస్తోంది. ప్రధానమంత్రి మోడీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారంటే.. మళ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, మళ్లీ ఎలాంటి సర్ప్రైజులు ఇస్తారో అనే ఆందోళన అవినీతి పరులకు ఉండాలి. చిత్రంగా సామాన్యుడు భయపడుతున్నాడు! గడచిన యాభై రోజుల్లో సాధించింది ఏదైనా ఉందంటే ఇదే..!