మొత్తానికి 2016లోనే సూపర్ డూపర్ కామెడీ పొలిటికల్ ఎంటర్టెయినర్ సమాధానం ఇచ్చిన ఎమ్మెల్యేగా జలీల్ ఖాన్ మిగిలిపోతారని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. బీకామ్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ కలిపేసి.. తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని తనవైపు మళ్లించుకోవడంతో పాటు, దేశవ్యాప్తంగా పాపులరైపోయారు! ఆయన ఇంటర్వ్యూ వీడియోకి ఇంగ్లిష్ సబ్ టైటిల్స్‌తో జాతీయ మీడియా కూడా ప్రసారం చేసింది. ఓరకంగా జలీల్ ఖాన్‌కు జాతీయ స్థాయి ప్రచారం తీసుకొచ్చిన జవాబు అది! అయితే, ఇంత జరిగాక కూడా జలీల్ స్పందన ఎలా ఉంటుందని అనుకుంటాం… ఏదో పొరపాటున నోరు జారననో, నిజంగానే ఆ విషయ పరిజ్ఞానం తనకు లేదని బోల్డ్‌గా ఒప్పుకుంటారేమో అని అనుకుంటే పొరపాటు!
ఈ కామెంట్స్‌పై వివరణ కోరేందుకు ఓ ప్రముఖ జాతీయ ఆంగ్ల పత్రిక జలీల్ ఖాన్‌ను ఫోన్ చేసింది. బీ.కామ్ చదువు గురించి ఎందుకలా చెప్పారూ అనే ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం సీక్వెల్ స్థాయిలో ఉంది. ఆ ఇంటర్వ్యూ చేసిన విలేకరి రాత్రి పూట ప్రశ్నలు అడిగారనీ, బాగా ఒత్తిడి చేయడంతో తప్పక కూర్చున్నాననీ తాను ఏదో మాట్లాడేశానని జలీల్ చెప్పారు. అంతేకాదు, తాను చెప్పిన చాలా విషయాలను ఇంటర్వ్యూలో డిలీట్ చేశారని జలీల్ ఆరోపించారు. చివరిగా ఏమన్నారంటే… ‘ఏదైతేనేం, జాతీయ స్థాయిలో మంచి పాపులారిటీ వచ్చింది కదా! మంచిదే కదా’ అని జలీల్ ఖాన్ సదరు జాతీయ మీడియా సంస్థకు వివరణ ఇచ్చారు.
ఇంతకీ, తన వ్యాఖ్యలకు ప్రజలు నవ్వుకుంటున్నారనీ, కామెడీగా తీసుకుంటున్నారని జలీల్ అర్థం చేసుకున్నట్టున్నారు. కానీ, తెలుగుదేశం పార్టీ వర్గాలు ఇంకోలా అర్థం చేసుకున్నాయి! జాతీయ స్థాయిలో జలీల్ గురించి టామ్ టామ్ అయిపోయింది. ఇలాంటి నాయకుడికి మంత్రి పదవి ఇస్తే పార్టీ పరువు పోయే అవకాశం ఉందని తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో ఈయనకు బెర్త్ కన్ఫర్మ్ అని గతంలో అనుకున్నారు. చేజేతులా మంత్రి పదవిని ఆయనే వదలుకున్నట్టు చేసుకున్నారు. ఇంత డామేజ్ జరిగినా కూడా గుర్తించలేని పరిస్థితిలో జలీల్ ఖాన్ ఉన్నారా..?