తెలుగు 360 రేటింగ్: 2.75
పిరియాడికల్ సినిమాలు తెలుగులో చాలా తక్కువ. ఓ సీరియస్ సబ్జెక్ట్‌ని డీల్ చేయడానికి మన వాళ్లు అంతగా ఆసక్తి చూపించరు. ‘మనకు కామెడీ కావాలండీ.. లేదంటే ఆడియన్స్‌కి ఎక్కదు’ అనేస్తుంటారు. నిజాయతీగా ఓ ప్రయత్నం చేయడానికి ఫార్ములా లెక్కలన్నీ అడ్డొచ్చేస్తుంటాయి. కొన్నేళ్ల క్రితం నారా రోహిత్ అదే చేశాడు. ‘బాణం’తో ఓ ప్రయత్నం చేశాడు. అందులో కామెడీ ట్రాకులుండవు. ఐటెమ్ గీతాలుండవు. తాను నమ్మిన కథ చెప్పే ప్రయత్నం మాత్రమే ఉంటుంది. ‘ప్రతినిధి’ కూడా అంతే. ఇప్పుడు మరోసారి ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అంటూ ఓ క్రిటికల్ సబ్జెక్ట్ ఎంచుకొన్నాడు. రొటీన్‌కి భిన్నంగా సాగిన ఈప్రయాణంలో నారా రోహిత్ అనుకొన్న గమ్యాన్ని చేరుకొన్నాడా? లేదా??
కథ
రైల్వే రాజు (శ్రీ విష్ణు) కి అమ్మ.. అక్క.. ఆట అంటే ప్రాణం. అంతర్జాతీయ క్రీడాకారుడిగా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. క్రికెట్ తప్ప మరో ధ్యాస ఉండదు. కోచ్ అండదండలూ ఉంటాయి. నిత్య (తన్య హోప్) అంటే ఇష్టం. తానూ.. రాజుని ప్రేమిస్తుంటుంది. మరోవైపు ఇంతియాజ్ (నారా రోహిత్) కి నక్సలైట్లంటే ద్వేషం. చిన్నప్పుడే తన తల్లిదండ్రుల్ని నక్సల్ దాడిలోనే కోల్పోతాడు ఇంతియాజ్. ఆ కోపంతో నక్సలైట్లని ఏరి పారేయడమే పనిగా పెట్టుకొంటాడు. అందుకు రూల్స్ ని బ్రేక్ చేయడానికి కూడా వెనుకంజ వేయడు. భగవాన్ దాస్ (జీవీ) అనే లోకల్ దాదాకి బాకీ పడతాడు రాజు. బాకీ తీర్చలేదని నిత్యని తీసుకెళ్లిపోతాడు. అక్కడ జరిగిన గొడవలో రాజు చేతిలో భగవాన్ దాస్ ప్రాణాలు కోల్పోతాడు. మరోవైపు రైల్వే రాజు అక్క చాలా యేళ్ల క్రితం నక్సల్ ఉద్యమంలో కలిసిపోతుంది. దాంతో నక్సలైట్లకీ రైల్వే రాజుకీ సంబంధం ఉన్న నెపంతో.. రాజుపై గురి పెడతాడు ఇంతియాజ్. అలా పోలీసుల చేతిలో ఇరుక్కుపోవాల్సి ఉంటుంది. అటు ఆటకీ, ఇటు అమ్మకీ దూరమైపోవాల్సివస్తుంది. ఈ దశలో రైల్వే రాజు ఎలా మారాడు?? తనకు జరిగిన అన్యాయానికి ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు. రాజు, ఇంతియాజ్‌ల యుద్ధం ఎన్ని మలుపులు తీసుకొంది? అనేదే కథ.
తెలుగు 360 విశ్లేషణ
1992 – 1996 మధ్యలో హైదరాబాద్‌లో జరిగిన కథ ఇది. అప్పట్లో నక్సల్ ఉద్యమాలు ఉధృతంగా సాగేవి. ప్రపంచీకరణ ప్రభావం కూడా అప్పుడే పడుతోన్న కాలం అది. ఈ రెండు విషయాలకూ…. క్రికెటర్ కావాలని కలలు కంటున్న ఓ యువకుడి జీవితానికీ కథ ముడిపెట్టిన విధానం బాగుంది. దర్శకుడు అక్కడే మార్కులన్నీ కొట్టేశాడు. నక్సల్ ఉద్యమ నేపథ్యం ఉంది కదా అని.. వాటి లోతుపాతుల్లోకి, సిద్ధాంతాల జోలికి వెళ్లలేదు. ప్రపంచీకరణ, ప్రైవేటీ కరణ అని చెప్పి లెక్చర్లు దంచలేదు. ఆ నేపథ్యం కథని ఎంత కావాలో అంతే తీసుకొన్నాడు. తన తప్పేం లేకుండా తన కలల్ని, జీవితాన్నీ కోల్పోయిన ఓ యువకుడు… కేవలం లక్ష్యం మీద తప్ప దాన్ని అందుకొనే ప్రయాణం మీద ఏమాత్రం నమ్మకం లేని ఓ నిజాయతీగల పోలీస్ అధికారి… వీరిద్దరి మధ్య పోరాటం ఈ సినిమా. కథని ప్రారంభించిన విధానం.. నెమ్మదిగా ఉన్నా – ప్రేక్షకుల్ని ఓ విధంగా ప్రిపేర్ చేయడానికి వాడుకొన్నాడు దర్శకుడు. రైల్వేరాజు కలలు, అతని జీవితం.. చూపిస్తూ మెల్లిమెల్లిగా నక్సల్ ఉద్యమంతో లింకు పెట్టాడు. నారా రోహిత్ పాత్ర ఎంటర్ అవ్వడంతోనే కథలో వేగం వస్తుంది. క్రికెటర్ కావాలనుకొనేవాడు క్రిమినల్ అయ్యే విధానం ఆ పాత్రపై జాలి కలిగేలా చేస్తాయి. ద్వితీయార్థంలో రైల్వేరాజు నిజంగానే ఓ గుండాలా, దాదాలా ఎదగే క్రమం చూపించారు. ఆయా సన్నివేశాలు మరీ రొటీన్‌గా సాగడం.. అప్పటి వరకూ నారా రోహిత్ – శ్రీ విష్ణుల మధ్య ఢీ అంటే ఢీ అంటూ సాగిన డ్రామా మిస్ అవ్వడంతో సినిమా ఎటు పోతుందో అనిపిస్తుంది. సినిమా మరో అరగంటలో ముగుస్తుందనగా రోహిత్ ఎంట్రీ ఇవ్వడంతో మళ్లీ దర్శకుడు ట్రాక్ ఎక్కేస్తాడు. ఈ కథని దర్శకుడు ఎలా ముగిస్తాడో అనుకొంటున్న తరుణంలో ఓ ట్విస్ట్ ఇచ్చి.. కథని మరింత రసదాయకంలో పడేస్తాడు. కథని, ఆ కథలోని అన్ని పాత్రల్నీ దర్శకుడు ముగించిన విధానం ఆకట్టుకొంటుంది. ఈ కథలో హీరోలూ, విలన్లు ఎవ్వరూ లేరు.. పరిస్థితులే ఆ పాత్ర పోషించాయనిపిస్తుంది. మధ్యమధ్యలో కొన్ని సన్నివేశాలు సుదీర్ఘంగా సాగడం, అనవసరమైన పాటలు ఈ కథ టెంపో తగ్గిస్తాయి. అయితే ఓవరాల్‌గా దర్శకుడు తాను చెప్పదలచుకొన్న విషయంపైనే ఫోకస్ పెట్టడం ఆకట్టుకొంటుంది. కామెడీ ట్రాక్‌లు, ఐటెమ్ సాంగుల జోలికి పోకుండా.. కేవలం ఓకే పాయింట్ చుట్టూ కథ నడిపించి.. ఈ సినిమాకి ఓ థ్రిల్లర్ లుక్ తీసుకొచ్చాడు.
నటీనటులు
ఇలాంటి కథల్ని ఎంచుకోవడం ఓరకంగా రిస్కే. అయితే… అలాంటి రిస్కులు తీసుకోవడంలో నారా రోహిత్ ముందుంటాడు. కేవలం కథపై నమ్మకంతోనే ఈ సినిమాకి తానూ ఓ నిర్మాతగా మారాడు. ఇంతియాజ్ పాత్రలో రోహిత్ యధావిధిగా తనకు అలవాటైన దారిలో నడిచాడు. బేస్ వాయిస్ మరోసారి తనకు ప్లస్ అయ్యింది. గత సినిమాల్లోలానే లావుగా కనిపించినా… అదేం ఇంతియాజ్ పాత్రకు అడ్డు రాలేదు. శ్రీ విష్ణు నటన ఆకట్టుకొంటుంది. జీవితాన్ని కోల్పోయి గ్యాంగ్ స్టర్‌గా మారడం.. మళ్లీ తనదంటూ ఓ జీవితం కావాలని పరితపించడం.. ఇలా విభిన్న భావోద్వేగాలున్న పాత్ర దక్కింది. అజయ్, రాజీవ్ కనకాల కనిపించింది కాసేపే. బ్రహ్మాజీకి ఫుల్ లెంగ్త్ పాత్ర దక్కింది. అందులో రాణించాడు కూడా. కథానాయిక పాత్ర గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు.
సాంకేతిక వర్గం
ఇలాంటి కథల్లో పాటలు ఇమడవు. ఒకవేళ పాటలు వినిపించాలంటే మంచి ట్యూన్లు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదు. ఆవిషయంలో సాయికార్తీక్ విఫలమయ్యాడు. పాటలు కథ వేగానికి స్పీడు బ్రేకర్లు వేస్తాయి. అయితే నేపథ్య సంగీతం మాత్రం.. అదిరిపోయింది. సీనులో 50 శాతం విషయం ఉంటే మరో 50 శాతం ఆర్.ఆర్ వల్ల.. యాడ్ అయ్యింది. ఇక్కడో బలమైన డైలాగ్ పడాలి.. అని బలవంతంగా ఫిలాసఫీ చొప్పించకుండా చాలా సహజంగానే మాటల్ని రాశారు. దర్శకుడికి ఇదే తొలి చిత్రం. పాస్ మార్కులు పొందేద్దాం అన్న ఆత్రంతో కొత్త దర్శకులు ప్రేమకథల్ని, మాస్ సినిమాల్నీ ఎంచుకొంటారు. కానీ సాగర్ కె.చంద్ర మాత్రం నిజాయతీతో ఓ ప్రయత్నం చేశాడు. తన ఎఫెక్ట్ సినిమాలో కనిపిస్తూనే ఉంటుంది. మధ్యమధ్యలో సినిమా డ్రాప్ అవుతూ వస్తున్నా.. కంటెంట్ బలంగా ఉండడంతో.. కొన్ని మైనస్సులు కనిపించలేదు. ఎమోషన్ నిండిన క్లైమాక్స్ ఈసినిమాకి ప్రాణం పోసినట్టైంది.
‘అప్పట్లో ఒకడుండేవాడు..’ అద్భుతాలు సృష్టించే సినిమా కాదు గానీ.. కచ్చితంగా మంచి ప్రయత్నమే! బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా ఫలితాన్ని అప్పుడే అంచనా వేయడం కష్టం. ఎందుకంటే ‘మనమంతా’లాంటి మంచి సినిమాల్ని పక్కన పెట్టగలిగే నేర్పు తెలుగు సినిమా బాక్సాఫీసుకి మాత్రమే తెలుసు. అయితే మూస ధోరణిలో సాగే సినిమాలమధ్య, మనల్నీ, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఓ పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లిపోయింది ఈ సినిమా.
తెలుగు 360 రేటింగ్: 2.75