తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరికొన్ని రోజులు కొనసాగుతాయి. శీతాకాల సమావేశాలను జనవరి 11 వరకు నిర్వహించాలని బి ఎ సి సమావేశంలో నిర్ణయించారు. ఆ తర్వాత ఉభయ సభలూ జనవరి 3కు వాయిదా పడ్డాయి.
అర్థవంతమైన చర్చ జరిగితే ఎన్ని రోజులైనా సభ నిర్వహించదానికి అభ్యంతరం లేదని సిఎం కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. అందుకు అనుగుణంగా సమావశాలను పొడిగించారు. అయితే నిష్పక్ష పాతంగా జరిగితేనే సభకు వస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే ప్రభుత్వ, స్పీకర్ వైఖరికి నిరసనగా సభను బహిష్కరించారు.
ప్రస్తుత సమావేశాల్లో చాలా వరకు చర్చ తప్ప రచ్చ పెద్దగా కనిపించలేదు. పలు అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. పెద్దనోట్ల రద్దును కేసీఆర్ సమర్థించిన తీరుకు అంతా విస్తుపోయారు. నల్లధనంపై జరుగుతున్న యుద్ధానికి అందరూ మద్దతు ఇవ్వాలంటూ విపక్షాలకు సూచించారు.
ఇప్పుడు కొత్త ఏడాది లో మరో ఏడు రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి. ఏడు రోజుల్లొ ఏడు అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. అయితే కాంగ్రెస్ వైఖరి పై తెరాస నేతలు గుర్రుగా ఉన్నారు. సంఖ్యా బలం తక్కువగా ఉన్నా వారికి ఎక్కువ అవకాశం ఇచ్చామని గుర్తు చేస్తున్నారు.
ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో భూసేకరణ అంశం దుమారం రేపింది. ప్రభుత్వ వైఖరిపై విపక్షాలు దండెత్తాయి. అయితే తెరాస కూడా అంతే దీటుగా విమర్శలను తిప్పికొట్టింది. ఈ సందర్భంగా సిఎం సుదీర్ఘ ప్రసంగం ఆకట్టుకుంది.
ఇంకా అనేక అంశాల పైనా వాడి వేడి చర్చ జరిగింది. రెండో దశ సమావేశాలు కూడా అదే తరహాలో జరగవచ్చు. వీలైనంత వరకు ప్రతిపక్షాల వాయిస్ వినిపించే అవకాశం ఇవ్వాలని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నామనే అపఖ్యాతి రాకుండా చూడాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది.