చేతిలో ఓ ఛానలో, ఓ వెబ్ సైటో, పత్రికో ఉంటే చాలు.. జులూం చూపించడానికి చాలామంది రెడీ అయిపోతుంటారు. ‘మా ఛానల్ గొప్ప.. మాకు తిరుగులేదు’ అన్నట్టు వ్యవహరిస్తుంటారు. అక్కడితో ఆగరు. బ్లాక్ మెయిలింగ్కీ దిగిపోతుంటారు. ప్రస్తుతం ఇండ్రస్ట్రీలో అదే జరుగుతోంది. ఓ పేరున్న ఛానెల్లో పనిచేస్తున్న సినిమా ఇన్ ఛార్జ్.. ఆగడాలు రోజు రోజుకీ మితిమీరిపోతున్నాయని ఇండ్రస్ట్రీ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. సదరు సినిమా ఇన్ ఛార్జ్‌కి సినిమాల గురించి ఏమాత్రం అవగాహన లేదు. నిజానికి ఆయన రిపోర్టరేకాదు. కెమెరాకి సంబంధించిన డిపార్ట్మెంట్లో పనిచేసి… యాధృచ్చికంగా సినిమా ఇన్ ఛార్జ్ అయ్యాడు. ఆయనగారికి వ్యక్తిగతంగా వెబ్ సైట్ ఉంది. టీవీ ఛానల్‌కి యాడ్లు ఇచ్చినా ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. కానీ ఆ వెబ్ సైట్‌కి మాత్రం యాడ్లు ఇవ్వాల్సిందే. లేదంటే తాను పని చేస్తున్న టీవీ ఛానల్లో ఆ సినిమాకి సంబంధించి, అందులో నటిస్తున్న హీరోకి సంబంధించి నెగిటీవ్ వార్తలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడిపోతుంటాయి. రివ్యూ కూడా `ఈ సినిమా చూడొద్దు` అన్నట్టుగానే ఉంటుంది.
అంతే కాదు.. సినిమా వాళ్లకు సంబంధించిన వాట్సప్ గ్రూపుల్లో ఆ సినిమాని తిడుతూ కౌంటర్లు ఇవ్వడం కోసం నలుగురైదుగురు `సబ్`లను పెట్టుకొన్నాడీయన. ఓ వైపు సినిమా చూస్తూనే ఉంటారు.. మరో వైపు వాట్సప్ గ్రూపుల్లో ఆ సినిమాని చీల్చి చెండాడుతూ మెసేజీలు వచ్చి పడిపోతుంటాయి. తనతో గొడవ ఎందుకులే అని.. అవసరం ఉన్నా, లేకుండా.. సదరు సైట్ కి రేటింగ్ ఉన్నా లేకున్నా యాడ్లు మాత్రం ధారాళంగా ఇచ్చేస్తున్నారు. ఇటీవల ఓ పెద్ద సినిమా పీఆర్వోకి ఫోన్ చేసి.. ‘మీ సినిమా యాడ్లు ఇవ్వకపోతే దానికి నెగిటీవ్ ప్రచారం చేస్తా’ అని నేరుగా బ్లాక్ మెయిల్‌కి దిగిపోయాడంటే.. పరిస్థితి ఎంతకు దిగజారిందో అర్థం చేసుకోవొచ్చు. దాంతో అటు పీఆర్వోలు, ఇటు నిర్మాతలు సదరు వ్యక్తిపై గుర్రుగా ఉన్నారు. టీవీ యాజమాన్యానికి కంప్లైంట్ చేసేందుకు బలమైన ఆధారాలతో రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఆ బ్లాక్ మెయిలర్ ఆటలకు ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందో చూడాలి.