అదేంటో… ఆంధ్రాకి కేంద్రం అచ్చిరావడం లేదు! కేంద్రం ఇద్దామనుకున్నవి ఏవీ ఆంధ్రాకి రావడం లేదు. ఆంధ్రా అడగాల్సి ఉన్నవేవీ కేంద్రాన్ని అడగలేదు. ఇస్తామని చెప్పినవి కూడా భాజపా ఇవ్వలేకపోతోంది. తెలుగుదేశం తెచ్చుకోలేకపోతోంది. ప్రత్యేక హోదా అంశాన్నే తీసుకోండి! ఇస్తామని చెప్పింది భాజపా. కానీ, ఇవ్వలేదు. తెస్తామని చెప్పింది తెలుగుదేశం. కానీ, తేలేకపోయింది! ఆ తరువాత, కేంద్రం ఇచ్చిన హామీల్లో మరో ముఖ్యమైంది… ఆంధ్రాకి రైల్వే జోన్. అదిగో ఇదిగో వచ్చేస్తోందని ఆ మధ్య కాస్త హడావుడి చేశారు. ఆ తరువాత, ఆ టాపిక్ తెరమీదికి రాలేదు. కేంద్రం దాదాపుగా మరచిపోయిన ఈ ఇష్యూ గురించి ఇప్పుడు మాట్లాడింది ఎవరయ్యా అంటే… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే!
నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే లైన్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైల్వే జోన్ గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఇది చాలా సున్నితమైన అంశమని అన్నారు! సాధ్యమైనంత వేగంగా సమస్యలు క్లియర్ అయిపోయే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు కేంద్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని చంద్రబాబు చెప్పారు.
నిజానికి, కేంద్ర రైల్వే మంత్రి ఆంధ్రా నుంచే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన్ని ఏపీ నుంచి ఎన్నుకున్న సందర్భంలో తెలుగుదేశం చాలా ఆశలే పెట్టుకుంది. ఆయన మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రి కాబట్టి, రైల్వే జోన్ వెంటనే వచ్చేస్తుందని అనుకున్నారు. అయితే, ఆ తరువాత సురేష్ ప్రభు ఆంధ్రాని ప్రత్యేకంగా పట్టించుకున్నదే లేదు. కానీ, ఆయనకు ఏపీ అంటే ప్రత్యేక శ్రద్ధ చంద్రబాబు నాయుడు సర్టిఫై చేస్తుండటం విడ్డూరం.
రైల్వే జోన్ సున్నితమైన అంశం ఎలా అవుతుందో చంద్రబాబు చెప్పాలి! ముఖ్యమంత్రి మాటలు ఎలా ఉన్నాయంటే.. దీన్ని కూడా ప్రత్యేక హోదా వదిలేసినట్టు వదిలేస్తారా అనే అనుమానాలుకు తావిస్తున్నాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోండని కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయాల్సింది పోయి, ఆంధ్రా గురించి రైల్వే మంత్రి ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పడమేంటో..?