ఉత్తర్ ప్రదేశ్ లో నేతాజీగా ప్రాచుర్యం పొందిన ములాయం సింగ్ యాదవ్ రాజకీయ వైభవం మరుగున పడిపోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడి హోదాలో తనయుడు అఖిలేష్ నే బహిష్కరించడం చారిత్రక తప్పిదం కావచ్చు. ములాయం సభలకు జనం ఎగబడి రావడం గత చరిత్ర. ఇప్పుడు కాలం మారింది. యువతరంలో అఖిలేష్ కే పేరుంది. కాబట్టి ఇప్పుడు రాజీ పడటం ములాయం వంతు.
ముఖ్యమంత్రిగా ఉన్న అఖిలేష్ ను పార్టీ నుంచి బహిష్కరించడం ద్వారా, నేనే సుప్రీం అని చాటుకోవాలనే ఈగోను ములాయం ప్రదర్శించారు. తమ్ముడి కోసం తనయుడిని గెంటేయడం కలకలం రేపింది. ఇప్పుడు అఖిలేష్ మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంది. లేకపోతే పదవి పోతుంది. అయితే అంత వరకూ రాకపోవచ్చంటున్నారు పరిశీలకులు. యూపీలో 403 మంది ఎమ్మెల్యేలున్నారు.
సమాజ్ వాదీ పార్టీకి 229 మంది సభ్యులున్నారు. బీఎస్పీకి 80 మంది, బీజేపీకి 40 మంది, కాంగ్రెస్ కు 28 మంది, ఆర్ ఎల్ డి.కి 8 మంది సభ్యులున్నారు. అఖిలేష్ మెజారిటీ నిరూపణకు 202 మంది మద్దతు అవసరం. 190 మందికి పైగా సభ్యులు తనకు మద్దతిస్తున్నారని అఖిలేష్ చెప్తున్నారు. ఒక వేళ అంతకన్నా తక్కువ మంది మద్దతున్నా అఖిలేష్ ప్రభుత్వానికి డోకా ఉండదు. ఎందుకంటే ఆయన్ని కాపాడటానికి కాంగ్రెస్ కచ్చితంగా ముందుకొస్తుంది. మద్దతిస్తుంది. అవసరమైతే బీజేపీ కూడా పరోక్షంగా ఆయనకు సహకరిస్తుంది. ఆ పార్టీకి చెందిన 40 మంది సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నా, అఖిలేష్ పని సులువవుతుంది.
సమాజ్ వాదీ పార్టీ నిలువునా చీలిపోతే అది తమకు ఎన్నికల్లో లాభిస్తుందని కచ్చితంగా కమలనాథులు అంచనా వేస్తారు. కాబట్టి అఖిలేష్ బలపరీక్షలో నెగ్గితే అది ములాయంకు చెక్ పెట్టినట్టు అవుతుంది. ఈ కోణంలో బీజేపీ పరోక్ష సహకారం గ్యారంటీగానే భావించవచ్చు.
కేవలం ఈగో వల్లే ఈ పరిస్థితి వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది. బాబాయి శివపాల్ సింగ్ కు అఖిలేష్ తో పొసగడం లేదు. పార్టీ పెట్టినప్పటి నుంచీ ములాయం వెన్నంటి ఉన్న వ్యక్తి శివపాల్. కాబట్టి ఆయనకే పూర్తి మద్దతు ప్రకటించారు ములాయం. ఇక్కడ ఆయనొక లాజిక్ మిస్ అయ్యారు. తమ్ముడు, తనయుడి మధ్య రాజీ కుదరకపోయినా, ఎన్నికలయ్యే వరకూ సంయమనం పాటిస్తే పరిస్థితి మరోలా ఉండేది. కనీసం ఇప్పుడైనా రాజీపడి తనయుడితో కలిసి ఎన్నికల బరిలోకి దిగడానికి చివరి అవకాశం ఉంది. లేకపోతే ఏ బీజేపీయో అధికారంలోకి వస్తే ములాయం చేతిలో ఉన్న పవర్ చేజారుతుంది. అధికార పార్టీ అధినేతగా చక్రం తిప్పే అవకాశం ఉండదు.
ఎన్నికల్లో ఈసారి ఓడినా, 43 ఏళ్ల అఖిలేష్ కు రాజకీయంగా ఇంకా భవిష్యత్తు ఉంటుంది. 77 ఏళ్ల ములాయంను మాత్రం క్రమంగా జనం మర్చిపోయే పరిస్థితి రావచ్చు. అదే జరిగితే ములాయం తనను తానే నిందించుకోవాల్సి ఉంటుంది.