మేకింగ్ విషయంలో తనదంటూ ఓ బ్రాండ్ వేసిన దర్శకుడు శ్రీనువైట్ల. మాస్కామెడీ ఎంటర్ టైన్మెంట్లకు పెట్టింది పేరు. కాకపోతే.. తన సినిమాల్నీ ఒకే జోనర్లో సాగడం, అన్ని కథలూ ఒకేలా ఉండడంతో.. శ్రీనువైట్ల `బ్రాండ్` బోర్ కొట్టేసింది. శ్రీనువైట్ల ఫార్ములాతో శ్రీనువైట్లనే కాకుండా చాలా మంది దర్శకులు సినిమాలు తీసి పారేయడంతో… శ్రీనువైట్ల పేరు చెప్పేసరికి విసుగొచ్చేసింది. ఆగడు, బ్రూస్లీ ఫ్లాపులతో.. శ్రీనువైట్ల పదేళ్లువెనక్కి వెళ్లిపోయినట్టైంది. ఇప్పుడు ఈ దర్శకుడికి ఓ హిట్టు కొట్టడం అత్యవసరం. తన కసినీ, తన మార్క్‌ని చూపించడం అవస్యం. అందుకే తన ఎఫెక్ట్ అంతా.. ‘మిస్టర్’లో పెట్టేసినట్టు కనిపిస్తోంది. వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. హెబ్బా పటేల్, లావణ్య త్రిపాఠీ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్… ఈరోజే బయటకు వచ్చింది.
శ్రీనువైట్ల చాలా కాలం తరవాత ఓ లవ్ స్టోరీ చెప్పడానికి ప్రయత్నించినట్టు అర్థమవుతోంది. టీజర్లో శ్రీనువైట్ల గత సినిమాల మార్కులేం కనిపించలేదు. హీరోయిజం, మాసిజం.. వీటి కోసం బిల్డప్పులూ ఇవ్వలేదు. ప్లజెంట్‌గా. ఓ అర్థవంతమైన ప్రేమకథ చూడ్డానికి ఆడియన్స్‌ని ప్రిపేర్ చేస్తున్నట్టుంది టీజర్. మిక్కీ జే అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆహ్లాదకరంగా సాగడంతో ఈ సినిమాపై ఓ ఫీల్ గుడ్ ఇంప్రెషన్ పడినట్టైంది. ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేసవే.. శ్రీనువైట్ల కెరీర్‌ని డిసైడ్ చేయనుందన్న మాట.