మనసుంటే మార్గం ఉంటుంది. నిధులు లేవు లేవంటూ ఏడుస్తూ కూర్చుంటే ఉపయోగం లేదు. కేంద్రం నుంచి వీలైనన్ని నిధులు రాబట్టడానికి ప్రయత్నం చేస్తూనే, సొంతగా ఆర్థిక వనరుల సమీకరణకు చిత్తశుద్ధితో వ్యూహాలు రచించాలి. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న క్రియేటివ్ నిర్ణయం అలాంటిదే.
కొత్తగా ఆలోచిస్తే కొంగొత్త మార్గాలు వెతుక్కుంటూ వస్తాయి. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణక్ష్ం అలాంటిదే. రాష్ట్రంలోని గెస్ట్ హౌస్ ల స్థానంలో త్రీ స్టార్ హోటళ్ల నిర్మాణం చేయించాలని సర్కార్ నిర్ణయించింది. ఎన్నో దశాబ్దాలుగా ఉన్న ప్రభుత్వ అతిథి గృహాలను కూల్చేసి ఈ హోటళ్లను నిర్మిస్తారు.
ప్రతి జిల్లా కేంద్రంలోనూ కనీసం ఏడెనిమిది ఎకరాల స్థలంలో గెస్ట్ హౌస్ లను కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించారు. వీటిని నిర్మించింది, నిర్వహించేది రోడ్లు భవనాల శాఖ. ఒకప్పుడు రో్డ్లు దారుణంగా ఉండేవి. రాజధానికి వంద కిలోమీటర్ల దూరంలోని జిల్లాకు వెళ్లాలంటే గంటలు గంటలు సమయం పట్టేది. అందుకే సాయంత్రం తర్వాత అక్కడే గెస్ట్ హౌస్ లో బసచేసి మర్నాడు ఉదయం రాజధాని చేరుకునే వారు మంత్రులు లేదా ఉన్నతాధికారులు.
ఇప్పుడు కాలం మారింది. రోడ్లు బాగుపడ్డాయి. వంద కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే హైస్పీడ్ లగ్జరీ కార్లను మంత్రులు, అధికారులు వాడుతున్నారు. కాబట్టి గెస్ట్ హౌస్ ల అవసరం లేకుండా పోయింది. ఆ స్థలంలో విశాలమైన త్రీ స్టార్ హోటల్ నిర్మాణంతో బోలెడు ఆదాయం వస్తుంది. ఇప్పుడు ప్రజల జీవన శైలిలో మార్పు వచ్చింది. హోటళ్లకు ఆదరణ పెరిగింది. ప్రయివేట్ డెవలపర్స్ కు డెవలప్ మెంట్ పద్ధతిలో అప్పగించినా ఆదాయం దండిగానే ఉంటుంది. సదరు హోటళ్లలో కొన్ని గదులను ప్రభుత్వ అధికారులకు లేదా మంత్రులకు కేటాయించేలా ముందే ఒప్పందం చేసుకుంటారు. కాబట్టి, నిజంగా ఆ జిల్లా కేంద్రంలో బస చేయాల్సి వచ్చినప్పుడు గదులు ఎలాగూ అందుబాటులో ఉంటాయి.
ఏపీ మొత్తం మీద 193 గెస్ట్ హౌస్ లున్నాయి. వాటి ద్వారా భారీగానే ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పాడుబడ్డ భవనాలను కూల్చేసి ఆధునిక హోటళ్ల నిర్మాణం చేయడం ఏ రకంగా చూసినా లాభదాయకమే అని అంచనా వేస్తోంది. మొదటి దశలో విజయవాడ, గుంటూరు, రాజమండ్రిల్లోని గెస్ట్ హౌస్ స్థలాల్లో త్రీస్టార్ హోటళ్ల నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు.