ప్రముఖ కన్నడ సాహితీవేత్త ఎం.ఎం.కలబుర్గి (77)ని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు నిన్న హత్య చేసారు. నిన్న ఉదయం ధార్వాడలోని ఆయన ఇంటి ఆవరణలో వాకింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అతిసమీపం నుండి ఆయనను తుపాకీతో కాల్చి చంపి బైక్ పై పారిపోయారు. అయన నుదురు, కంట్లో నుండి రెండు బుల్లెట్లు దూసుకుపోవడం మరణించారు. ఆయనని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనని రక్షించే ప్రయత్నాలు ఫలించకపోవడంతో మరణించారు. 1962 నుండి అద్యాపకుడిగా జీవితం ఆరంభించిన ఆయన తన ప్రతిభాపాటవాలతో అంచలంచెలుగా ఎదుగుతూ హంపీ విశ్వవిద్యాలయానికి ఉపకులపతి స్థాయిలో సేవలందించారు. కన్నడ సాహితీ రంగంలో ఆయన సాహితీవేత్తగా మంచి పేరుంది. సాహితీ రంగంలో ఆయన రచనలకు గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కన్నడ సాహితీ పురస్కారం, పంపా అవార్డు తదితర అనేక పురస్కారాలను అందుకొన్నారు. అటువంటి ప్రముఖ సాహితీ వేత్త ఇంత దారుణంగా హత్యకు గురి కావడంతో యావత్ కన్నడ సాహితీ ప్రియులు, ప్రజలు చాలా దుఃఖిస్తున్నారు. రాళ్ళు, రప్పలకు పూజలు చేయవద్దని ఆయన ఉద్భోదిస్తుండేవారు. కనుక హిందూ మత ఛాందసవాదులేవరో ఆయనను హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కలబుర్గికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.