హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్ ఘనంగా ప్రారంభమైంది. నిజానికి ఇది 77వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన. అయినా ఎగ్జిబిషన్, నుమాయిష్ గానే ఇది ప్రాచుర్యం పొందింది. ఈసారి నుమాయిష్ లో 2500 స్టాల్స్ ఏర్పాటుచేశారు.
రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ లు కొత్త ఏడాది ప్రారంభం నాడు దీన్ని ప్రారంభించారు. తొలిరోజే సందర్శకులు పోటెత్తారు. ఇంకా అనేక స్టాల్స్ లో ఇంటీరియర్ వర్క్ జరుగుతున్నా న్యూఇయర్ ఆదివారం రావడంతో వేల మంది తరలివచ్చారు.
ఈసారి నుమాయిష్ కు ఓ ప్రత్యేకత ఉంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత డబ్బులకు ఇబ్బంది కలుగుతోంది. చిల్లర సమస్య ఉంది. అందుకే సహకార బ్యాంకు వారు నుమాయిష్ లో ప్రత్యేకంగా మొబైల్ ఏటీఎంను అందుబాటులో ఉంచారు. దీన్ని కూడా మంత్రులు ప్రారంభించారు. 76 ఏళ్ల క్రితం ఓ చిన్న ప్రదర్శనగా మొదలైన నుమాయిష్ ఇప్పుడు దేశంలోనే కాదు, విదేశాల్లోనూ ప్రాచుర్యం పొందింది. కాశ్మీర్ నుంచి కేరళ వరకు వివిధ రాష్ట్రాల వ్యాపారులు, హస్తకళల ఉత్పత్తిదారులు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు.
జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరిగే ఈ ఎగ్జిబిషన్ లో కనీసం వంద కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. పిల్లలకు వినోదానికి జెయింట్ వీల్, టాయ్ ట్రైన్ తదితరాలు అందుబాటులో ఉంటాయి.
అయితే నుమాయిష్ లో ధరల దోపిడీ పెరుగుతూనే ఉంది. ఎం ఆర్ పి కంటే రెట్టింపు ధరలకు వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ తదితరాలను అమ్మే వారు కూడా ఉన్నారు. గత ఏడాది ఈ దోపిడీ మరీ ఎక్కువైనట్టు ఆరోపణలు వచ్చాయి. ఈసారి దీనికి చెక్ పెట్టాలని సందర్శకులు కోరుతున్నారు.