పెద్ద నోట్ల రద్దు తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనాకర్షక పథకాలు ప్రవేశపెట్టినట్టుగానే మోడీ మాట్లాడారు. అంతే తప్ప, పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా అతలాకుతలమైపోయిందో ప్రస్థావన లేదు! దెబ్బతిన్న పరిశ్రమలూ కుంటుబడ్డ వ్యాపారాలూ నోట్ల లేమి… ఈ పరిస్థితులు ఎప్పటికి చక్కనౌతాయో చెప్పనే లేదు. బ్యాంకుల ముందు క్యూ లైన్లలో మరణించినవారి ప్రస్థావనే లేదు. దేశప్రజల సహనాన్ని మెచ్చుకున్నారే తప్ప.. వాస్తవాలను ప్రస్థావించలేదు! కొన్ని రాయితీలు ప్రకటించి… ఏదో సాధించామన్న భావనను, ఏదో ప్రతిఫలం ప్రజలకు కేంద్రం ఇచ్చేస్తోందన్న ఆశను రేకెత్తించే ప్రయత్నమే మోడీ ప్రసంగంలో కనిపించింది. మోడీ ప్రసంగం అయిపోయింది కదా! ఇప్పుడు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మీడియా ముందుకు వచ్చారు.
కేంద్రంలోని భాజపా సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని అద్భుతంగా చిత్రించగల వాక్చాతుర్యం వెంకయ్య సొంతం! ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వలేనితనాన్ని కూడా గొప్పతనంగా చెప్పగలడం ఆయనే సాధ్యం. ఇప్పుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగంలోని విషయాలను అదే రేంజిలో చాలా గొప్పగా విడమరచి చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల కలిగే లాభాలను ఏకరువు పెట్టడం మొదలుపెట్టేశారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ద్రవ్యోల్బణం తగ్గుతుందని వెంకయ్య చెప్పారు. కేంద్ర ఖజానాకు భారీ మొత్తంలో సొమ్ము చేరిందనీ, తద్వారా వడ్డీ రేట్లు తగ్గుతాయని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని వివరించారు!
మధ్య తరగతికీ పేద ప్రజానీకానికీ రైతులకూ మహిళలకూ పెద్దలకూ అనేక మందికి అనేక రకాలు రాయితీలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కల్పించారని వెంకయ్య చెప్పారు. అందుకే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటనకు దేశవ్యాప్తంగా స్వాగతిస్తున్నారు అన్నారు. మోడీ ప్రకటించిన రాయితీలనునోట్ల రద్దు వలన తొలి విడత లభించిన సాయంగా దీన్ని ప్రజలు చూస్తున్నారని ఆయనే చెప్పారు!
అయినా, నోట్ల రద్దుకీ తాజాగా ప్రధాని మోడీ ప్రకటించిన సోకాల్డ్ రాయితీలకు సంబంధం ఉందా..? నోట్లను రద్దు చేస్తే తప్ప ఈ తరహా రాయితీలు ప్రకటించే వీలు లేదా..? బ్యాంకుల్లోకి ప్రజల సొమ్ము వచ్చినంత మాత్రాన ఆర్థిక వ్యవస్థ ఎలా గాడిలో పడుతుంది..? మార్కెట్లో చెలామణికి సొమ్ము చాలడం లేదే..? ఇలాంటి బేసిక్ అంశాలను వదిలేసి… ఇకపై ప్రధాని చేసే ప్రతీ ప్రకటనా నోట్ల రద్దు ద్వారా సాధించిన విజయంగానే అభివర్ణించేందుకు వెంకయ్య సిద్ధంగా ఉన్నట్టున్నారు! ఓహో… నోట్లను రద్దు చేసింది ఇలాంటి రాయితీలు ఇవ్వడానికన్నమాట! ప్రస్తుతానికి ఇలా ఫిక్స్ అవుదాం. ఇంకేదైనా మార్పులూ చేర్పులూ ఉంటే వెంకయ్య చెబుతారు కదా.