నేటి నుండి ఐదు రోజుల పాటు ఆంద్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు హైదరాబాద్ లో జరుగబోతున్నాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకి నివాళులు అర్పించడంతో సమావేశాలు మొదలవుతాయి. ఈ సమావేశాలను కనీసం రెండు వారాలయినా నిర్వహించాలని వైకాపా కోరబోతోంది. కానీ తెదేపా దానిని వ్యతిరేఖించడం తధ్యం కనుక ‘ప్రజా సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం వెనుకాడుతోంది,’ అని ఆరోపించే అవకాశం వైకాపాకి ఉంటుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ తీర్మానం చేయాలని వైకాపా ఈరోజు నోటీసు ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఒకవేళ దానిని కూడా తెదేపా వ్యతిరేకిస్తే వైకాపాకి మరో గొప్ప ఆయుధం అందించినట్లవుతుంది. రాజధాని భూసేకరణ, ఓటుకి నోటు కేసు, తెదేపా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుక అక్రమ రవాణా-తహసిల్దార్ వనజాక్షిపై దాడి వ్యవహారం వంటి సమస్యలే కాక డ్వాక్రా, పంట రుణాల మాఫీ వంటి రెగ్యులర్ అంశాలు ఎలాగూ వైకాపా చేతిలో ఆయుధాలుగా ఉండనే ఉన్నాయి.
కనుక ప్రత్యేక హోదా అంశంపై సభలో చర్చ, తీర్మానం కోరుతూ తెదేపాయే స్పీకర్ కి నోటీసు ఇవ్వాలనుకొంటున్నట్లు సమాచారం. తద్వారా తెదేపా ప్రభుత్వమే దాని కోసం చొరవ తీసుకొంటున్నట్లు చెప్పుకోవచ్చును. ప్రత్యేక హోదా విషయం గురించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడారు కనుక ఇప్పుడు శాసనసభలో దాని కోసం తీర్మానం చేసి పంపడం వలన తెదేపాకి ఎటువంటి ఇబ్బంది, బీజేపీకి ఎటువంటి అభ్యంతరం ఉండకపోవచ్చును. కానీ దానిని కేంద్రప్రభుత్వం పట్టించుకొంటుందనే నమ్మకం లేదు. ఇంతకు ముందు రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రప్రభుత్వానికి పంపినప్పుడు దానిని చెత్త బుట్టలో పడేసింది. ఒకవేళ కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లయితే ఈ తీర్మానాన్ని గౌరవించి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు చెప్పవచ్చును. లేదంటే ఇది కూడా చెత్తబుట్ట పాలుకాక తప్పదు. అప్పుడు వైకాపా ప్రత్యేక హోదా కోసం తన పోరాటాన్ని మరింత ఉదృతం చేయవచ్చును.