ఈ యేడాది తొలి రోజే… మహేష్ బాబు తన అభిమానులకు పండగ లాంటి వార్తని వినిపించాడు. ఒకటి కాదు.. రెండు కాదు, ఏకంగా మూడు సినిమాల్ని ఒకేసారి ఫిక్స్ చేసేశాడు. ”మరో రెండేళ్ల వరకూ నా దగ్గరకు కథలు పట్టుకొని రావాల్సిన అవసరం లేదు..” అంటూ పరోక్షంగా మిగిలిన దర్శకులకు సంకేతాలు పంపినట్టైంది. మహేష్ ఓ విషయంలో క్లియర్‌గా ఉన్నాడు. సినిమా, సినిమాకీ మధ్య గ్యాప్ తీసుకోవడం, కథల ఎంపిక విషయంలో జాప్యం చేయడం మహేష్‌కి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే మూడు కథల్ని ఫిక్స్ చేసుకొన్నాడు. దాంతో పాటు…తనపై ఎలాంటి రూమర్లు రాకుండా ముందుగా జాగ్రత్తపడిపోతున్నాడన్నమాట. ”ఫలానా దర్శకుడితో మహేష్ సినిమా చేస్తాడట” అంటూ ఓ పత్రిక రాస్తే, ”కాదు కాదు.. ఫలానా దర్శకుడితో” అంటూ ఓ వెబ్ మీడియా వదంతుల్ని సృష్టించడానికి మహేష్ ఏ మాత్రం అవకాశం ఇవ్వదలచుకోవడం లేదు. దాంతో అటు ఫ్యాన్స్‌కీ, ఇటు మీడియాకీ, తన దర్శక నిర్మాతలకీ మహేష్ సినిమాల విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఓ క్లారిటీ వచ్చేసినట్టైంది.
మహేష్ తాజా ప్రకటనతో ఇద్దరు దర్శకులు మాత్రం కాస్త ఇబ్బంది పడడం సహజం. వాళ్లే… పూరి, విక్రమ్ కె.కుమార్. బిజినెస్ మేన్ తరవాత మహేష్ తో ఓసినిమా చేయాలని పూరి గట్టిగా డిసైడ్ అయ్యాడు. ‘జనగనమణ’ అంటూ ఓ టైటిల్‌ని రిజిస్టర్ చేసి మహేష్‌ని ఊరించాలని చూశాడు. ఈ సినిమా చేస్తున్నా… అని మహేష్ చెప్పినా, ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మహేష్ తాజా ట్వీట్‌తో మరో రెండేళ్ల వరకూ పూరితో సినిమా ఉండదన్నది డిసైడ్ అయ్యింది. మహేష్‌తో సినిమా చేయాలని పడిగాపులు కాస్తున్న మరో దర్శకుడు విక్రమ్ కె.కుమార్. ఇది వరకే వీరిద్దరి కాంబో సెట్ అవ్వాల్సింది. మీడియా కూడా ఇద్దరూ కచ్చితంగా సినిమా చేస్తారని లోగడ వార్తలు ప్రచురించింది. ఇప్పుడు వాటికీ పుల్ స్టాప్ పడిపోయినట్టైంది. పీవీపీతో విబేధాలు వచ్చిన నేపథ్యంలో వంశీ పైడిపల్లి సినిమా ఏమవుతుందా అనే కన్ఫ్యూజన్ నెలకొంది. దానికీ.. మహేష్ ట్వీట్ సమాధానం చెప్పినట్టే. ఒక్క ట్విట్టుతో… చాలా విషయాల్లో క్లారిటీ ఇచ్చేశాడు మహేష్. సో.. గ్రేట్ కదూ..!