అందరి చూపూ… ఈ సంక్రాంతి పైనే. చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో ఏది గెలుస్తుంది? ఎవరు సత్తా చాటుతారు? ఎవరెన్ని రికార్డులు బద్దలు కొడతారు? అనేదే చర్చ. గౌతమిపుత్ర శాతకర్ణి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని సెన్సార్‌కి సిద్ధమైతే, ఖైదీ నెం.150 సెన్సార్ కూడా పూర్తయి, తొలి కాపీ సిద్ధంగా ఉంది. ఈ సినిమా నిడివి దాదాపు రెండున్నర గంటలుగా తేలింది. ఈరోజుల్లో రెండున్నర గంటలంటే పెద్ద సినిమానే. అందులో కొన్ని సన్నివేశాల్ని ట్రిమ్ చేసే అవకాశాలేమైనా ఉన్నాయా అంటూ చరణ్, వినాయక్ సుదీర్ఘంగా ఆలోచిస్తున్నార్ట. అయితే చిరంజీవి మాత్రం ”కటింగులు వొద్దు.. ఎలా ఉందో అలానే రిలీజ్ చేయండి” అంటూ స్ట్రాంగ్ గా చెప్పేశాడట. చిరునే అలా అంటే.. చరణ్ కత్తెర పట్టే సాహసం ఎందుకు చేస్తాడు?
ఖైదీ నెం.150 ఫైనల్ అవుట్ పుట్ విషయంలో చిరు ఫుల్ ఖుషీగా ఉన్నాడని, అనుకొన్నది అనుకొన్నట్టు తీసినందుకు వినాయక్‌పై ప్రసంశల జల్లు కురిపించాడని ఇన్ సైడ్ వర్గాల టాక్. మాస్ పల్స్ తెలిసిన వినాయక్ డాన్సులు, పాటలు, మసాలా సీన్లపై ప్రత్యేకంగా దృష్టి నిలిపాడని, అవి బాగా క్లిక్కయ్యాయని, పాటలు..సెట్లు, డాన్సుల విషయంలో చిరు, వినాయక్‌లు తీసుకొన్న శ్రద్ధ వల్ల ఈ సినిమా మరింత ప్రత్యేకంగా తయారైందని చెబుతున్నారు. ట్రైలర్ కట్ విషయంలో చిరు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నాడని, ట్రైలర్‌తోనే హైప్ క్రియేట్ చేయాలని, ఇప్పటి వరకూ ఈ సినిమాపై ఉన్న నెగిటీవ్ ఫీలింగ్ అంతా పోవాలని చిరు భావిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రెడీ అయ్యిందని, చిరు కొన్ని మార్పులూ చేర్పులూ సూచించడంతో.. ట్రైలర్‌ని మళ్లీ కొత్తగా కట్ చేయడం మొదలెట్టారని, ఈనెల 7న గుంటూరులో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్‌ని ప్రదర్శిస్తారని టాక్.