దేన్నయినా తెగేదాకా లాగొద్దు. లాగితే సీన్ రివర్స్ అవుతుంది. సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ లకు ఈ విషయం ఆలస్యంగా బోధపడింది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇద్దరికీ ఉన్న పదవి ఊడిపోయింది.
సమాజ్ వాదీ పార్టీ అధినేతగా, యూపీలో తిరుగు లేని నేతాజీగా ఓ వెలుగు వెలిగిన ములాయం సింగ్ యాదవ్ తన కన్న కొడుకు చేతిలోనే చేదు అనుభవం ఎదుర్కొన్నారు. అఖిలేష్ ను పార్టీ నుంచి బహిష్కరించడం అనేది తెగే దాకా లాగడమే. ఫలితం ఏమైంది? ఏకు మేకైంది. అఖిలేష్ దూకుడు పెంచాడు. జాతీయ అధ్యక్షుడిగా తన వర్గం వాళ్లచేత ప్రకటింప చేసుకున్నాడు. తండ్రి పోస్టుకే ఎసరు పెట్టాడు.
భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడిగా, బీజేపీ ఎంపీగా అనురాగ్ ఠాకూర్ కూడా ఓ వెలుగు వెలిగాడు. లోధా కమిటీ సిఫార్సులు అమలుచేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను పెడచెవిన పెట్టాడు. వాటిని అమలు చేయడం తమవల్ల కాదని వితండ వాదం చేశాడు. సంస్కరణల విషయంలో కోర్టు ఎంత సీరియస్ గా ఉందోతెలిసి కూడా బీసీసీఐ పెద్దల సహజ సిద్ధమైన అహంకార ధోరణిని ప్రదర్శించాడు. దీంతో సుప్రీం కోర్టు ఆగ్రహించింది. ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. అంతేకాదు, అజయ్ షిర్కేను కార్యదర్శి పదవి నుంచి కూడా గెంటేసింది.
తనయుడితో రాజీ పడటం ద్వారా ఇప్పటికైనా చక్రం తిప్పే అవకాశం ములాయంకు ఉంది. ఈసీ చుట్టూ తిరిగే బదులు కొడుకును పిలిచి సంధి చేసుకుంటే అందరికీ మంచిదని కొందరు సూచిస్తున్నారు. ఠాకూర్ విషయంలో ఆ అవకాశం లేదు. ఇప్పుడు సారీ చెప్పినా పోయిన పదవి వాపస్ రాదు. కథ కంచికి. ఆయన ఇంటికి.