ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఎదురుచూసే నాయకులు ఉంటారు! మంత్రి పదవి కోసం వెయిట్ చేస్తున్న ఎమ్మెల్యేలు ఉంటారు. కానీ, గవర్నర్ పోస్ట్ కోసం ఎదురుచూసే నాయకుడు అనగానే అందరికీ గుర్తొచ్చేది… తెలంగాణ తెలుగుదేశం నేత మోత్కుపల్లి నరసింహులు. ఆ పదవి కోసమే ఆయన ఇంకా కలలు కంటున్నారని చెప్పాలి. కొత్త సంవత్సరంలో ఆయన ఆకాంక్ష నెరవేరడం ఖాయమని తెలంగాణ రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ జరుగుతోంది.
నిజానికి, మోత్కుపల్లికి గవర్నర్ గిరీ అనేది ఇప్పటి మాట కాదు. ఒక దశలో తెలుగుదేశంలో నాయకులందరూ ఆయన్ని సరదాగా గవర్నర్ అనే పిలుచుకునేవారు. ఆయన కూడా మానసికంగా ఆ పదవికి సిద్ధమైపోయారు. స్వతహాగా దూకుడు స్వభావం ప్రదర్శిస్తూ ఉండే మోత్కుపల్లి… గవర్నర్ పదవి కోసం నయా గాంభీర్యాన్ని కూడా అలవాటు చేసుకున్నారని అంటున్నారు. ఒక సగటు రాజకీయ నాయకుడిలా విమర్శించడం తగ్గించేసుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లో సైతం హుందాగా ఉండటం అలవర్చుకున్నారు. అంతా బాగానే ఉందిగానీ, గవర్నర్ పదవి మాత్రం ఆయనకి ఇంకా రావడం లేదు. గడచిన కొన్నాళ్లుగా మోత్కుపల్లికి సంబంధించిన చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో కూడా తగ్గిపోయిందని చెప్పాలి.
కానీ, ఈ మధ్య మోత్కుపల్లి పార్టీ కార్యకలాపాల్లో కాస్త చురుకైన పాత్ర పోషించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బాగానే శ్రమించారు. పార్టీకి సంబంధించిన ఇతర కార్యక్రమాల పట్ల కూడా గతం కంటే క్రియాశీల భాగస్వామ్యం తీసుకుంటున్నారని టి. దేశం నేతలే అంటున్నారు. ఎలాగూ గవర్నర్ పదవి వచ్చే అవకాశం లేదు కాబట్టి… రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కీలకంగా మారేందుకు మోత్కుపల్లి సిద్ధపడుతున్నారా అనే అభిప్రాయం ఓ దశలో కలిగింది.
కొత్త సంవత్సరం సందర్భంగా మోత్కుపల్లి చాలా ఖుషీగా ఉన్నారనీ… ఆయన ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అనుచరులు కూడా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ప్రాక్టికల్‌గా చూసుకుంటే… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రికమండేషన్ మీదనే కేంద్రంలోని భాజపా స్పందించాలి కదా! మోత్కుపల్లికి గవర్నర్ గిరీ కట్టబెట్టాలి కదా! కానీ, ప్రస్తుతం అలాంటి పరిస్థితి కేంద్రంలో ఉందా..? చంద్రబాబు చెబితే చేసే పరిస్థితిలో మోడీ ఉన్నారా అనేదే అనుమానం. ఏదేమైనా మోత్కుపల్లి ఈ ఏడాది గవర్నర్ అవుతారని పెద్ద ఆశలే పెట్టుకున్నారని చెప్పాలి.