ఇద్దరు కొట్టుకొంటే.. మూడోవాడికి లాభం అన్నట్టు – చిరు, బాలయ్యల ఫైటింగ్‌తో తాను లాభపడాలని ప్లాన్ వేస్తున్నాడు దిల్‌రాజు. వ్యాపార వ్యూహాల్లో దిల్‌రాజుని కొట్టేవాడే లేడు. అలాంటి దిల్ రాజు ఓ స్కెచ్ వేశాడంటే దాని వెనుక లోతైన ప్లానింగ్ ఉండే ఉంటుంది. ఈ సంక్రాంతి వ్యూహంలో కూడా దిల్‌రాజు తన బుర్రకు పదును పెట్టాడు. సంక్రాంతి సమరానికి బాలకృష్ణ, చిరుల సినిమాలు రెడీ అయ్యాయి. వీరి పోటీ ఏ రేంజులో ఉంటుందో చూడాలని చిత్రసీమ మొత్తం తహతహలాడిపోతోంది. అయితే వాటి మధ్యన దిల్‌రాజు తన `శతమానం భవతి` విడుదల చేస్తున్నాడు. రెండు సింహాల మధ్య శర్వానంద్ సినిమా చిట్టెలుకలానే కనిపిస్తోంది. సంక్రాంతి సమరానికి దిల్‌రాజు ఎందుకు తొందరపడుతున్నాడు? పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమా నలిగిపోతోందేమో అన్న భయాలున్నాయి. కానీ దిల్‌రాజు లెక్క వేరు.
11న ఖైదీ, 12న గౌతమి పుత్ర వస్తున్నాయి. ఏ పెద్ద సినిమా అయినా ఈ రోజుల్లో దాని ప్రభావం మూడు రోజులే. అంటే.. 14న విడుదల కాబోతున్న తన సినిమాపై ఈ రెండు సినిమాలూ ఏమాత్రం ప్రభావం చూపించవని దిల్‌రాజు గట్టి నమ్మకం. పైగా ఒకటి క్లాస్ సినిమా.. మరోటి మాస్ సినిమా. తనది ఫ్యామిలీ సినిమా. సంక్రాంతి పండగ, దాని వైభవం `శతమానం భవతి`లో చూపించబోతున్నాడు దిల్‌రాజు. కాబట్టి ఈ పండక్కి ఇదే కరెక్ట్ సినిమా అన్నది దిల్‌రాజు నమ్మకం. ఈ రెండు సినిమాల రిపోర్ట్ దిల్ రాజు దగ్గర ఉందని, ఆ సినిమాల ఫలితాన్ని దిల్ రాజు తక్కువ అంచనా వేస్తున్నాడని, అందుకే తన సినిమాని రిలీజ్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడని తెలుస్తోంది. మరి దిల్ రాజు అంచనా కరెక్ట్ అవుతుందా? లేదంటే బొక్క బోర్లా పడతాడా? అన్నది తెలియాలంటే ఈ సంక్రాంతి వరకూ ఆగాల్సిందే.