చెప్పినట్లుగానే ప్రత్యేక హోదాపై శాసనసభలో చర్చ కోరుతూ స్పీకర్ కోడెల శివప్రసాద రావుకి నోటీసు ఇచ్చింది. ఊహించినట్లుగానే దానిని ఆయన తిరస్కరించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సభలో ఒక ప్రకటన చేయబోతోంది కనుక దానిపై చర్చకు అనుమతించడం లేదని స్పీకర్ చెప్పడంతో దీనిపై ముందుగా చర్చ జరపాలని పట్టుబడుతూ వైకాపా సభ్యులు సభలో ఆందోళన మొదలుపెట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా తేదేపాకు చెందిన ఇద్దరు కేంద్రమంత్రుల చేత తక్షణమే రాజీనామాలు చేయించాలని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెప్పగా, ప్రస్తుతం ఈ అంశంపై చర్చకు అనుమతించలేదు కనుక దానికి సబంధించిన విషయాల గురించి కూడా మాట్లాడవద్దని స్పీకర్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. కానీ సభలో వైకాపా సభ్యులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. కనుక ఇక సభ వాయిదాల పర్వం మొదలవవచ్చును.
ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ఆందోళనలు, ఆత్మహత్యలు మొదలయిన నేపధ్యంలో ఈ అంశంపై శాసనసభలో చర్చించాని వైకాపా కోరడం సహేతుకమయినదే. కానీ దానిపై ప్రభుత్వం సభలో ప్రకటన చేస్తుందనే సాకుతో చర్చ జరపకపోవడం సమర్ధనీయం కాదు. అలాగే ప్రత్యేక హోదా గురించి చర్చ జరగాలని పట్టుబడుతున్న జగన్మోహన్ రెడ్డి దాని గురించి మాట్లాడకుండా ఇద్దరు కేంద్రమంత్రులను రాజీనామాలు చేయమని కోరుతూ రాజకీయాలు చేయడం కూడా తప్పే. దాని వలన ఆయన చిత్తశుద్ధిని అనుమానించవలసి వస్తోంది.