ఖైదీ నెం.150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎంత గ్రాండ్‌గా జరగబోతోంది, ఆ రోజున చూపించే ట్రైలర్ ఎంత గొప్పగా ఉండబోతోంది అనేదానికంటే..ఆ ఫంక్షన్‌కి పవన్ కల్యాణ్ వస్తాడా, రాడా?? అనే ఆసక్తే ఎక్కువ నెలకొంది. మెగా ఫంక్షన్లకు పవన్ డుమ్మా కొట్టడం, ఆయా వేడుకల్లో వవన్ కల్యాణ్ అభిమానులు హద్దులు మీరి ప్రవర్తించడం, అది కాస్త ఇతర మెగా హీరోల్ని ఇబ్బంది పెట్టడం చూస్తూనే ఉన్నాం. కనీసం చిరు కార్యక్రమానికైనా పవన్ కల్యాణ్ వస్తాడా, రాడా.. వస్తే అక్కడ ఏం మాట్లాడతాడు? అనేదానిపై ఫోకస్ పెట్టారు మెగా ఫ్యాన్స్. ‘నేను బాబాయ్‌ని ఆహ్వానిస్తా.. రావడం రాకపోవడం ఆయన ఇష్టం’ అంటూ రామ్ చరణ్ బంతికి పవన్ వైపుకు విసిరేశాడు.
అంటే.. ఈ కార్యక్రమానికి పవన్‌ని పనిగట్టుకొని ఆహ్వానించడం ఖాయం. వస్తాడా, రాడా అన్నది ఇంకా చరణ్‌కి కూడా తెలీదన్నమాట. పవన్ వస్తే.. ఆ క్రెడిట్ చరణ్‌కి దక్కుతుంది. ‘స్వయంగా వెళ్లి ఆహ్వానించాడు.. అందుకే రాక తప్పలేదు ‘ అంటారు. ఒక వేళ డుమ్మా కొడితే.. ‘పిలిచిన రాలేదు.. పవన్’ అంటూ నిందలు వేయడానికి రెడీగా ఉంటారు. అందుకే తప్పు తనమీద రాకూడదన్న కారణంతోనే.. ‘బాబాయ్‌ని పిలుస్తున్నా..’ అంటూ స్వయంగా అభిమానులకు సందేశం పంపాడు. ఇప్పుడు ఒత్తిడంతా వపన్పైనే. మరోవైపు అల్లు అరవింద్, నాగబాబులు కూడా రంగంలోకి దిగి పవన్‌ని దువ్వే కార్యక్రమంలో బిజీగా ఉన్నారన్న టాక్స్ వినిపిస్తున్నాయి. ”అన్నయ్యకి ఇది చాలా ముఖ్యమైన సినిమా. ప్రచారంలో మనం వెనుకనున్నాం.. నువ్వు రావాల్సిందే” అంటూ నాగబాబు, అరవింద్ ఇద్దరూ పవన్‌ని కోరారట. అయితే పవన్ ఇప్పటి వరకూ తన నిర్ణయాన్ని చెప్పలేదని తెలుస్తోంది. బహుశా తన ప్రాణమిత్రుడు, మార్గదర్శి త్రివిక్రమ్‌తో ఓ మీటింగ్ పెట్టి.. అప్పుడు వెళ్లాలో, వద్దో ఓ తీర్మాణానికి వస్తాడేమో. ఖైదీ ఫంక్షన్‌కి పవన్ వస్తే మాత్రం… చిరు సినిమా ప్రచారానికి బూస్టప్ ఇచ్చినట్టే అవుతుంది. మరి పవన్ ఏం చేస్తాడో చూడాలి.