తెలంగాణ రాజకీయాల్లో కొత్త రాజకీయ కూటమికి పునాదులు పడ్డాయా..? ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు రాజకీయ శక్తులతోపాటు ఇతర సామాజిక సంస్థలూ మమేమకం కాబోతున్నాయా..? విడివిడిగా కంటే విపక్షాలన్నీ కలిసికట్టుగా ఒక గొడుగు కిందకి వచ్చే సూచనలున్నాయా..? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉన్నా… భవిష్యత్తులో ఒక బలమైన కూటమి అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమౌతున్నట్టుగా రాజకీయ వర్గాల్లో కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ కూటమికి నాయకత్వం వహించబోతున్నది ఎవరంటే… టీ జేయేసీ ఛైర్మన్ కోదండరామ్ అని తెలుస్తోంది.
తెలంగాణలో ప్రతిపక్షాలన్నీ చాలా వీక్‌గా ఉన్న సంగతి తెలిసిందే. సామ దాన భేద దండోపాయాలతో విపక్షాలను వీలైనంత వీక్ చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుంది. అయితే, విడిగా ఉన్నంతకాలం ఎవరైనా వీక్‌గానే ఉంటారు. కలిసి ముందుకు కదిలితేనే బలమెంతో బయటపడుతుంది. ప్రస్తుతం తెలంగాణలోని విపక్షాలన్నీ ఇదే ఆలోచనా క్రమంలో ఉన్నాయని చర్చ జరుగుతోంది. రాజకీయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కోవడమనేది తెలుగుదేశం, కాంగ్రెస్, వామ పక్షాలకు విడివిడిగా సాధ్యమయ్యే పని కాదు. అందుకే, ఈ రాజకీయ పార్టీలన్నీ ప్రజా సంఘాలతో కలిసి ఓ కూటమి కట్టబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ కూటమికి కోదండరామ్ కేంద్రంగా పనిచేసే అవకాశాలున్నాయి. ప్రభుత్వం తీరుపై ఇప్పటికే కోదండరామ్ తీవ్ర నిరసన గళమెత్తుతున్న సంగతి తెలిసిందే. ఓ రకంగా కోదండరామ్, ప్రతిపక్షాలూ ఒకే ట్యూన్లో ఉన్నాయి. ఇటీవల కోదండరామ్ ఓ దీక్ష చేపడితే తెలుగుదేశం తరఫున రేవంత్ వెళ్లి సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్ తరఫున ఉత్తమ్ కుమార్ కలిసి వచ్చారు. ఈ సందర్భంగానే విపక్షాలను కలుపుకుంటూ ఒక కార్యాచరణను సిద్ధం చేస్తే బాగుంటుందన్న ఆలోచన అక్కడే మొలకెత్తిందని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ ఆలోచనలకు ఒక కార్యరూపం వస్తుందని అంటున్నారు. సో… తెలంగాణ రాజకీయ యవనికలపై మరో కొత్త కూటమికి తెరమీదికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరి, ఈ కూటమి ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ఇది ఏర్పడే లోపే కేసీఆర్ నష్ట నివారణ చర్యలకు దిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు!