ప్రజలకు సుపరిపాలను అందించడం అనేది నాయకుల బాధ్యత… కానీ, దయాగుణంగా మారిపోయింది! ప్రజల కోసం ప్రాజెక్టులు నిర్మించడం నాయకులు కర్తవ్యం.. కానీ, వితరణగా మారిపోయింది! సాధారణ పరిపాలన కూడా అధికార పార్టీ భిక్షగా ప్రచారం చేసుకునే స్థాయికి నేతలు ఎ‘దిగి’పోయిన వైనాన్ని ఆంధ్రాలోనే చూడొచ్చు. అభివృద్ధి అంటే అది తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యమని గతంలో చంద్రబాబు నాయుడు చెప్పుకున్న సందర్భాలు కోకొల్లలు. అయితే, ఇటీవలి కాలంలో ఆ కాన్సెప్ట్‌ను మరింతగా ఓన్ చేసుకుని… ఇప్పుడు అంతా తన వల్లే జరుగుతోందని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నారు. ఈ స్వార్థపర్వంలో మరో అడుగు ముందుకు వేసి… తాము దేవతలమని సాక్షాత్తూ చంద్రబాబు నాయుడే అభివర్ణించుకుంటున్నారు.
కొత్త సంవత్సరం సందర్భంగా అవనిగడ్డ ప్రాంతానికి చెందిన కొంతమంది రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు పండించిన పంటలతో వండిన పాయసాన్నీ, అటుకుల్నీ కొంతమంది రైతులు చంద్రబాబుకు ఇచ్చారు. పట్టిసీమ ద్వారా వచ్చిన నీటితో పండిన పంటలు ఇవే అంటూ కృతజ్ఞతాపూర్వకంగా రైతులు వాటిని చంద్రబాబుకు అందించారు. ఈ సందర్భంగా వచ్చిన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ… ప్రతీరోజూ గోదావరిని తల్చుకోవాలని పిలుపునిచ్చారు. ‘నేను పట్టిసీమ ద్వారా నీళ్లు ఇవ్వకపోతే మీరంతా ఇలా ఇక్కడికి వచ్చేవారా’ అని రైతులను పశ్నించారు.
దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుకునేందుకు ఎన్నో రకాలుగా విఫలయత్నం చేసేవారనీ ఇన్‌డైరెక్ట్‌గా ప్రతిపక్ష వైకాపాను టార్గెట్ చేశారు. దేవతల యజ్ఞం ఫలించదనడానికి రైతులు చూపుతున్న ప్రేమ సాక్ష్యమని చంద్రబాబు చెప్పారు. అవనిగడ్డ నుంచి వెలగపూడి వరకూ రైతుల రావడమంటేనే దేవత విజయంగా అభివర్ణించారు.
అధికార పక్షంలో ఉన్నంత మాత్రాన నాయకులు దేవతలు అయిపోతారా..? ప్రతిపక్షంలో ఉన్నవారంతా రాక్షసగణమా..? ఆ లెక్కన పదేళ్లపాటు ప్రతిపక్షంలో కూర్చున్న చంద్రబాబు గతంలో ఏ గణంలో ఉన్నట్టూ. ప్రభుత్వం చేపట్టాల్సిన బాధ్యతల్ని కూడా లోకకల్యాణం కోసం చేసిన యజ్ఞాలుగా అభివర్ణించడమేంటో..? ‘నేను నీరు ఇవ్వకపోతే మీరు వచ్చేవారా’ అంటూ మధ్యలో ‘నేను’ అనడమేంటో..? పట్టిసీమ ద్వారా ఇస్తున్న నీరు చంద్రబాబు పెరటిలోని బావిలోంచి తోడుకొచ్చి ఇస్తున్నవి కాదుకదా!