దశాబ్ధం తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మధ్య పొలిటికల్ తెరపై ఎన్నో సందేశాలు ఇచ్చాడు. మరి ఇప్పుడు చిరంజీవి సినిమా ఎలా ఉండాలి? చిరంజీవి ఫ్యామిలీ, చిరు అభిమానులందరూ కూడా మరోసారి మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ అని పాట పాడుతున్నారు కానీ ఆ మార్గం అయితే చిరంజీవికి అంత సూటబుల్ కాదు. స్టాలిన్ సినిమా టైంలో మురుగదాస్ చెప్పినట్టుగా చిరంజీవిలాంటి కోట్లాది మంది అభిమానులున్న హీరోతో కేవలం కమర్షియల్ సినిమా తీయాలనుకోవడం కరెక్ట్ కాదు. తెలుగులో ఉన్న మిగతా స్టార్ హీరోలకు చిరంజీవికి ఉన్న తేడా కూడా అదే. రుద్రవీణ, ఠాగూర్‌లాంటి సినిమాలతో పాటు అభిలాష, ఛాలెంజ్, గ్యాంగ్‌లీడర్, విజేత లాంటి సినిమాల్లో కూడా జనాలకు పనికొచ్చే ఎంతో గొప్ప సందేశం ఉంటుంది. ఆ సినిమాలన్నింటిలోనూ మాస్‌ని మెస్మరైజ్ చేసే చిరు డ్యాన్సులు, ఫైట్లు కూడా ఉన్నాయి. కానీ వాటితో పాటు చిరంజీవి స్థాయిని పెంచే మెస్సేజ్ కూడా ఉంటుంది. చిరంజీవిని నైట్‌కి నైటే స్టార్‌ని చేసి పడేసిన ఖైదీ సినిమాలో కూడా యాక్షన్ ఎపిసోడ్స్, డ్యాన్సులతో పాటు ఆ జెనరేషన్ యువతరమంతా కనెక్ట్ చేసుకునే స్థాయి మెస్సేజ్ కూడా ఉంటుంది.
తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిన కత్తి సినిమాను రీమేక్ చేద్దామని చిరంజీవి అనుకున్నప్పుడు కూడా చాలా మంది పాజిటివ్‌గా రియాక్ట్ అవడానికి కారణం అదే. అయితే చిరు అండ్ కో అందరూ కలిసి తెలుగు మసాలాలతో ‘కత్తి’కి మకిలి అంటిస్తున్నారేమోనన్నదే చాలా మంది అనుమానం. కథలో ఉన్న అసలు విషయాన్ని వదిలేసి సినిమా అంతా కూడా చిరంజీవి డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ సీన్స్ అంటూ ఎక్కడ కంగాళీ చేసి పడేస్తారోనని కంగారు పడ్డారు. కానీ ఇఫ్పుడు రిలీజ్ అయిన రైతులకు సంబంధించిన పాట మాత్రం ఆ అనుమానాలను పటాపంచలు చేసింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా లిరిక్స్ మాత్రమే వినిపించేలా ఉంది. చెప్పదల్చుకున్న విషయాన్ని ప్రేక్షకులకు సూటిగా చేరవేసేలా ఉంది. వ్యక్తిగతంగా వినాయక్‌కి కూడా మెస్సేజ్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం. తను తీసిన బన్నీ, ఠాగూర్లతో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో కూడా మెస్సేజ్‌ని మిక్స్ చేయడానికి ట్రై చేశాడు. ఇప్పుడు ఈ ‘ఖైదీ నంబర్ 150’లో కూడా ప్రి క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకుల హృదయాలను టచ్ చేస్తుందని ఖైదీ యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ ‘రైతు కంట కన్నీరు…’ సాంగ్ కూడా అదే స్థాయిలో ఉంది. నిజానికి మురుగదాస్ రాసిన ఈ రైతు కన్నీరు కథ అయితే మాత్రం ప్రజలందరికీ చేరాల్సిన అవసరం ఉంది. రైతుల పండగ అయిన సంక్రాంతి టైంకి రిలీజ్ అవుతున్న ఈ రైతు వ్యథల కథ ఎంతమందికి రీచ్ అవుతుందో? శ్రీమంతుడు సినిమాకి వచ్చినట్టుగానే ఈ సినిమాకి కూడా నాయకుల నుంచి, సమాజం నుంచి స్పందన వస్తుందేమో చూడాలి మరి.