నిద్రపోతే వచ్చే కలలకూ నిద్ర పోనివ్వని కలలకూ చాలా తేడా ఉంటుంది. కలలు ఉండాల్సిందే. కానీ, వాటిని సాకారం చేసుకునే మార్గాన్వేషణ కూడా తోడైతేనే స్వప్నాలు సాకారం అవుతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చాలా కలలు ఉన్న సంగతి తెలిసిందే! నవ్యాంధ్రను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దాలని కృషి చేస్తున్నారు. నయా రాజధాని నగరం అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చి దిద్దాలని కలలు కంటున్నారు. ఈ క్రమంలోనే మరో కొత్త కలను యాడ్ చేశారు. అదేంటంటే… ఆంధ్రా నుంచి నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా ఎదగాలని!
తిరుపతిలో చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఏపీ నుంచి నోబెల్ బహుమతి సాధించిన వారికి రూ. 100 కోట్లు బహుమానంగా ఇస్తానని ఆయన ప్రకటించారు! ఏపీ నుంచి శాస్త్రవేత్తలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే తాను ఈ ప్రతిపాదన చేశానని చెప్పారు. ఆంధ్రా నుంచి కూడా నోబెల్ బహుమతి గ్రహీతలు తయారు కావాలని ఆకాంక్షించారు. నోబెల్ బహుమతి కోసం పిల్లలు పోటీ పడాలనీ, ఏపీ ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు బహుమతిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు.
రైట్… ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుకుందాం! శాస్త్రవేత్తలు ఒక రోజులో తయారైపోతారా..? శాస్త్రవేత్తలు తయారు కావాల్సింది ప్రభుత్వ పథకాల నుంచీ కాదు కదా! శాస్త్రవేత్తలను తయారు చేసుకోవాలంటే ఆ స్థాయి విద్యా ప్రమాణాలను అందించగలగాలి. ముందుగా వాటిపై దృష్టి సారించాలి. ఏపీలో చాలా కాలేజీల్లో ఇప్పటికీ ప్రయోగ శాలలే సరిగా లేవు. పరిశోధనలకు వీలైన వాతావరణం ఎంతవరకూ ఉందనేది అసలు ప్రశ్న..? విద్య ఒక లాభసాటి వ్యాపారంగా మారిపోయిందన్నది అక్షర సత్యం. ఎంత లాభసాటి అనేది చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా తెలియంది కాదు! ఏకంగా తెలుగుదేశం పార్టీకి ఒక భుజమై నిలుస్తున్న నాయకుల వ్యాపారాలే అవి!
వాస్తవాలను వదిలేసి, అవస్థాపనా సౌకర్యాల గురించి ఆలోచన లేకుండా రూ. 100 కోట్లు బహుమతులు ప్రకటిస్తే లాభం ఏముంటుంది..? ముందుగా ఆ కోట్ల ధనంతో అందరికీ మెరుగైన విద్య అందించే పరిస్థితులను కల్పించింది.. చాలు! నోబెల్స్ తీసుకొచ్చే సత్తా ఉన్న చిన్నారులు మన దగ్గరా ఉన్నారు. ముందుగా వారిని ప్రోత్సహించండి. మెరుగైన విద్యను తక్కువ ఖర్చుకే అందించే ప్రయత్నం చేయండి.