2014ఎన్నికల సమయంలో ఊరూరా తిరిగి చంద్రబాబు చెప్పిన మాట ఏంటి? టిడిపి అనుకూల మీడియా మొత్తం కూడా ఊదరగొట్టిన ప్రచారం ఏంటి? చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయండి…రైతు రుణాలన్నీ మాఫీ చేస్తాడు అని. 2014ఎన్నికల్లో విజేతను నిర్ణయించిన అతి ముఖ్యమైన ఫ్యాక్టర్ కూడా రైతు రుణమాఫీ హామీ అని ఎందరో విశ్లేషకులు కూడా తేల్చారు. అంతకుముందు చంద్రబాబుతో రైతులకు ఉన్న భయకంరమైన అనుభవాల దృష్ట్యా తన మాటలను రైతులు నమ్మే అవకాశం లేదని తెలుసుకున్న చంద్రబాబు కూడా మొదటి సంతకమే రైతు రుణమాఫీ హామీ అమలుపైన పెట్టేస్తానన్నాడు. చంద్రబాబు రైతుల రుణాలు మాఫీ చేస్తాడని అనుకూల మీడియా కూడా అదిరిపోయే ప్రచారం చేసింది. వెంకయ్యనాయుడు, పవన్ కళ్యాణ్‌లాంటి వాళ్ళందరూ కూడా రుణమాఫీ అయిపోతుందని ఆంధ్రప్రదేశ్ రైతులను నమ్మించారు.
అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మొదటి సంతకం విషయంలోనే మాటతప్పాడు చంద్రబాబు. రైతుల రుణాలను మాఫీ చేస్తూ కాదు……రుణమాఫీ కోసం ఓ కమిటీ వేస్తున్నానని చెప్పి మొదటి సంతకం చేశాడు. ఆ తర్వాత్తర్వాత కాలంలో తన మీడియా బలంతో రైత రుణమాఫీ అయిపోయిందని, రైతలందరూ పట్టలేని సంతోషంతో చంద్రబాబుకి ఆ వెంకటేశ్వరస్వామి స్థాయిలో పూజలు చేస్తున్నారని ప్రచారం చేసుకున్నారు. కానీ వాస్తవాలు దాచడం సాధ్యమా. అంతకుముందు ఏడాదితో పోల్చితే 2015లో రైతుల ఆత్మహత్యలు 44.9 శాతం పెరిగాయి. ఈ విషయాన్ని జాతీయ నేర గణాంక సంస్థ చెప్పింది. అధికారికంగానే 44.9 శాతం అంటే ఇక అనధికారికంగా యాభై శాతంపైగానే పెరుగుదల ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అది కూడా అంతకుముందు సంవత్సరాలలో రైతు కూలీలు ఎక్కువ సంఖ్యలో చనిపోతే ఈ సారి మాత్రం రైతులే ఎక్కువ మంది చనిపోయారు. రైతు ఆత్మహత్యలకు ప్రధాన కారణం కూడా అప్పులు తీర్చలేకపోవడం అని ఆ సంస్థ తేల్చిచెప్పింది. ఎన్నికల ముందు వరకూ కూడా అప్పులు తీర్చొద్దు…..నేనొచ్చి తీర్చేస్తా అని చంద్రబాబు చెప్పడంతో చాలా మంది రైతులు అప్పులు తీర్చలేదు. చంద్రబాబు మాటలను నమ్మడమే వాళ్ళ ప్రాణాల మీదకు తెచ్చింది. రాష్ట్రాన్ని అగ్రికల్చర్ హబ్‌గా మార్చేస్తా అని చంద్రబాబు ఎన్నోసార్లు చెప్పి ఉంటాడు. నదుల అనుసంధానం కూడా చేసి పడేశా. అనంతపురం రైతుల కష్టాలను కూడా తీర్చేశా అని చంద్రబాబు షో చేశారు కానీ వాస్తవాలు మాత్రం హృదయాన్ని కలిచివేసే స్థాయిలో ఉన్నాయి. మిగతా విషయాల్లో ఏ స్థాయిలో అభివృద్ధి చేశారో తెలియదు కానీ రైతుల ఆత్మహత్యల సంఖ్య విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అద్భుతమైన అభివృద్ధిని సాధించేశారు. యాభై శాతం వృద్ధి అంటే మాటలా?