రామ్ చరణ్‌కి నిర్మాతగా తొలి అనుభవం అందించిన సినిమా ఖైదీ నెం.150. ఈ సినిమా నుంచే నిర్మాతగా పాఠాలెన్నో నేర్చుకొన్నాడు. అనుభవం లేకపోవడంతో కొన్ని తప్పులు కూడా చేసేశాడు. ఆ తప్పుల ఎఫెక్ట్ మాత్రం ఖైదీ వసూళ్లపై తీవ్రంగా పడేది. ఈ ప్రమాదం ముందే గ్రహించిన నిర్మాత అల్లు అరవింద్ సత్వరం రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దకపోతే… పరిస్థితి దారుణంగా తయారయ్యేది. ఇంతకీ ఖైదీ విషయంలో చరణ్ చేసిన తప్పేంటి? దాన్ని అల్లు అరవింద్ ఎలా చక్కబెట్టాడు? ఈ వివరాల్లోకి వెళ్తే..??
ప్రతీ హీరోనీ, ప్రతీ నిర్మాతనీ నమ్ముకొని కొంతమంది సెటిల్డ్ బయ్యర్లు ఉంటారు. వాళ్ల చేతిలో కొన్ని థియేటర్లుంటాయి. సినిమాకి రెగ్యలర్ బయ్యర్లకే అమ్మడం వల్ల థియేటర్ల సమస్య రాదు. కొత్త బయ్యర్లు, సినిమా పంపిణీ వ్యవస్థపై ఏమాత్రం అవగాహన లేని బయ్యర్లు రంగంలోకి దిగితే… రిలీజ్ సమయానికి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖైదీ నెం.150 విషయంలో చరణ్ అనుభవ రాహిత్యం వల్ల థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. సినిమాని ఎక్కువ రేటుకి అమ్ముకోవాలన్న ఉత్సాహంతో పంపిణీ రంగంలో ఎలాంటి అనుభవం లేని, అసలు థియేటర్ల సిస్టం గురించి అవగాహన లేని బయ్యర్లకు ఈ సినిమాని కట్టబెట్టేశాడు చరణ్. సినిమానైతే మంచి రేటుకి అమ్మాడు గానీ, కొన్నవాళ్లు మంచి థియేటర్లు తెచ్చుకోగలరో లేదో అంచనా వేయలేకపోయాడు. దాంతో రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా పక్కా థియేటర్ల లిస్టు చేతికి అందలేదు. ఈ విషయం తెలుసుకొన్న అల్లు అరవింద్ రెండ్రోజుల క్రితమే రంగంలోకి దిగి… బయ్యర్లని పిలిచి మాట్లాడినట్టు తెలుస్తోంది. వాళ్లకు అందుబాటులో ఉన్న థియేటర్లు చూసి అరవింద్ షాక్ తిన్నాడట. ఇలాగైతే కష్టమని భావించి అప్పటికప్పుడు వాళ్లకంటూ కొన్ని థియేటర్లు చేతికి అందేలా చర్యలు తీసుకొన్నాడట. మరోవైపు గౌతమి పుత్ర శాతకర్ణి మెల్లిగా థియేటర్ల సంఖ్య పెంచుకొంటూ పోతుంటే… ఎలాగోలా దానికి చెక్ పెట్టి, థియేటర్లు ఖైదీకి దొరికేలా ప్లాన్ చేశాడట. అరవింద్ చాలా చాకచక్యంగా వ్యవహరించడం వల్ల పరిస్థితి చేతిలోకి వచ్చిందని, లేదంటే… చాలా నష్టం ఎదుర్కోవాల్సివచ్చేదని మెగా కాంపౌండ్ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.