`నా సీను తీసేశారు.. మా అమ్మ చనిపోయినంత బాధగా ఉంది` అంటూ ఫృద్వీ ఫేస్ బుక్‌లో ఓ సందేశం పంపాడు. `ఖైదీ నెం.150`కి నెగిటీవ్ ప్రమోషన్లో మరో నెగిటీవ్ పర్వం ఇది. ఫృద్వీ ఈ సినిమాలో నటించిన విషయం, ఆయన చేసిన ఏకైక సీన్ ఎడిటింగ్‌లో లేచిపోయిన సీన్ వాస్తవం. ఆ మాత్రం దానికి `అమ్మ చనిపోయినంత బాధగా ఉంది` అంటూ ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం మాత్రం అనవసర రాద్ధాంతం కిందే లెక్క! ఈ విషయాన్ని పట్టుకొని.. ఓ ప్రముఖ టీవీ ఛానల్ కూడా ఫృద్వీని వెదుక్కొంటూ వెళ్లి `ఈ వివాదం ఎంత వరకూ వచ్చింది?` అంటూ లేని వివాదాన్ని కెలికి కెలికి బయటకు తీయడంలో ఘోరంగా విఫలం అయ్యారనే చెప్పాలి. `ఈ విషయమై చిరంజీవితో మాట్లాడతారా` అంటూ అనవసర ప్రశ్నలతో హడావుడి చేసే ప్రయత్నం కనిపించింది. సీను కట్ చేసిందే చిరంజీవి అయితే.. ఫృద్వీ ఏం మాట్లాడతాడు? అసలు ఏదో సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం అటు ఫృద్వీకి గానీ, ఇటు సదరు ఛానల్ కి గాని ఏముంది? ఛానల్ రిపోర్టర్ ఎంత ప్రయత్నించినా భవిష్యత్తు ప్రమాదాలు గమనించిన ఫృద్వీ `ఇది టీ కప్పులో తుఫాను లాంటిది. పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు` అంటూ లైట్ తీసుకొన్నాడు. ఫేస్ బుక్‌లో అంత ఇదైపోయిన ఫృద్వీ.. కెమెరా ముందు పెట్టి, మైకు చేతికి అందించినప్పుడు అంత `లైట్` ఎలా అయిపోయాడో అర్థం కాదు.
ఏ సినిమాకైనా ఎడిటింగ్లూ, చివరి నిమిషాల్లో మార్పులూ చేర్పులూ తప్పని సరి. అవసరం అనుకోంటే కోట్లు పెట్టి తీసిన పాట కూడా పక్కన పెట్టాల్సిందే. ఇక ఫృద్వీ సీన్లు ఓ లెక్కా..?? నిజానికి ఈ సినిమాలో ట్రిమ్ అయ్యింది ఫృద్వీ సీన్ ఒక్కటే కాదు. పోసాని, బ్రహ్మానందం, రఘుబాబు, అలీ, కారుమంచి రఘు వీళ్లు చేసిన `కామెడీ` కూడా కట్ అయిపోయిందట. `కథకీ ఆయా సన్నివేశాలకూ, చెప్పిన డైలాగులకూ లింకులు కుదరవు` అనుకొన్నప్పుడు సదరు సన్నివేశాల్ని తొలగించడం సర్వసాధారణం.. దానికి మీడియా `వివాదం` అనే ముసుగు వేసి పెద్దది చేసే ప్రయత్నం చేస్తోంది. అయినా సినిమా విడుదలయ్యాక `అయ్యో.. ఇందులో నా సీన్ లేదే` అని బాధపడడం ఓ పద్ధతి. విడుదలకు ముందే ఇలాంటి లీకేజీలతో అనవసరంగా తనమీద ఉన్న ఇంప్రెషన్ని పోగొట్టుకొంటున్నాడు ఫృద్వీ.