సంఖ్యాబలం తక్కువగా ఉన్నా ప్రతిపక్షాల మాటకు విలువనిచ్చే విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధారణ పరిణతిని ప్రదర్శించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై నిన్ననే చర్చ ముగిసినా, అదే అంశంపై మళ్లీ ఇవాళ చర్చకు అంగీకరించారు. స్పీకర్ అనుమతిస్తే ప్రతిపక్ష సభ్యులు కోరిన వివరణ ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించారు. దీనిపై మళ్లీ చర్చకు అభ్యంతరం లేదన్నారు.
ఆ తర్వాత ఇదే అంశంపై మరోసారి చర్చ జరిగింది. కాంగ్రెస్, టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. సీఎం సరైన సమాధానం ఇవ్వలేదని నిరసన తెలుపుతూ వాకౌట్ చేశారు. అంతకు ముందు ప్రశ్నోత్తరాల తర్వాత ఈ అంశం చేపడతానని స్పీకర్ ప్రకటించినా ప్రతిపక్ష సభ్యులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు.
తాము ఎంత సానుకూల ధోరణితో ఉన్నా ప్రతిపక్ష సభ్యులు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని కేసీఆర్ కూడా అసహనం వ్యక్తంచేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని పక్కాగా అమలు చేస్తామన్నారు. నాణ్యత పాటించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుని తీరుతామన్నారు. గత ప్రభుత్వాలు 1880 కోట్ల రూపాయల బకాయిలను వదిలి వెళ్లాయని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 4687 కోట్ల రూపాయలు చెల్లించామని వివరించారు.
ఒకేసారి వంద శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడం సాధ్యం కాదని కేసీఆర్ చెప్పారు అయితే విద్యార్థులకు, కాలేజీకు ఇబ్బంది కలగని విధంగా పథకాన్ని అమలు చేస్తామని, నిధుల చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.