ఇద్దరు జగన్ లపై ఓ ఇద్దరు ప్రముఖులు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకటి విమర్శయితే మరోటి ప్రశంస. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు మెదడు లేదని ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు. గతంలో ఈయన జగన్ పంచనే ఉన్నారు. అప్పట్లో జగన్ ను వేనోళ్ల పొగిడారు. టీడీపీ కండువా వేసుకున్న తర్వాత జగన్ కు మెదడు లేదనే విషయం అర్థమైనట్టుంది.
జగన్ చేపట్టింది భరోసా యాత్ర కాదు బుదర యాత్ర అన్నారు భూమా. పట్టిసీమ గురించి తెలియక గతంలో విమర్శించాను. ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నానని చెప్పారు. చంద్రబాబు దూరదృష్టిని ఆయన ఎంతో పొగిడారు. జగన్ వ్యక్తిత్వంపై నిప్పులు చెరిగారు. అధికార పార్టీలో ఉన్నప్పుడు ఇది మామూలే కదా.
సినిమా దర్శకుడు వీవీ వినాయక్ మరో జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తనకు రాజమౌళి అంటేచాలా గౌరవమని చెప్పారు. రాజమౌళి కుటుంబం తామూ కలిస్తే అది ఫ్యామిటీ గెట్ టుగెదర్ లా పండగలా ఉంటుందట. అయితే పూరీ జగన్నాథ్ తనకెంతో స్ఫూర్తి అన్నారు వినాయక్.
కెరీర్ లో ఒడిదుడుకులు వచ్చినప్పుడు జగన్ ను గుర్తు చేసుకుంటారట వినాయక్. ఎంత డౌన్ ఫాల్ ఉన్నా ఏమాత్రం భయపడడు. తొణకడు బెణకడు. అదే పూరీ జగన్ ప్రత్యేకత అన్నారు. అంతే కాదు, వచ్చేజన్మలో పుడితే జగన్ లా పుట్టాలని ఉందన్నారు.
ఇంతకన్నా ప్రశంస ఇంకేముంటుంది. జగన్ ఇంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని ఇప్పటి వరకూ చాలా మందికి తెలియదు. ఇప్పుడు వినాయక్ ద్వారా అందరికీ తెలిసింది.