మన నాయకుల తీరే అంత. గొప్ప గొప్ప మాటలు మాట్లాడాలంటే మన నాయకుల తర్వాతే ఎవరైనా. ఓట్ల కోసం నీచ స్థాయికి దిగజారి మాట్లాడాలన్నా మన నాయకులను మించినవాళ్ళు లేరు. ఓ వైపు నరేంద్రమోడీనేమో దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతా…కష్టమైనా, నష్టమైనా భరించాల్సిందే అని మాటలు చెప్తూ ఉన్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బిజెపికి ఉన్న అతికొద్ది మంది ముఖ్యనేతల్లో ఒకరైన కిషన్రెడ్డివారు కూడా అంతే గొప్పగా మోడీ మాటలను వల్లెవేస్తూ ఉంటాడు. భారతీయులందరూ మోడీకి సపోర్ట్‌గా నిలబడాలని, అప్పుడే అద్భుతమైన భారతదేశం ఆవిష్కృతమౌతుందని, అద్భుతాలు జరుగుతాయని చెప్తూ ఉంటాడు. వీళ్ళెన్ని మాటలు చెప్పినా కొంతమంది బిజెపి భక్తులను మినహాయిస్తే ఎక్కువమంది మాత్రం అనుమానంగానే చూస్తున్నారు. అలా చూసేవాళ్ళను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఉంటారు ఇదే బిజెపి నాయకులు.
కానీ బిజెపి నేత శ్రీ కిషన్‌రెడ్డి మాత్రం రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడేశాడు. ఒక కిషన్‌రెడ్డి అనే కాదు. చాలా రాష్ట్రాల్లో ఉన్న బిజెపి నేతల మాటలు ఇంత దిగజారుడుగానే ఉంటున్నాయి. మతం, కులం, ప్రాంతాలపైన ప్రజలకు ఉండే దురభిమానాన్ని ఆయుధంగా చేసుకుని రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. కేవలం తెలంగాణా ప్రజల కోసమే ఉన్నామని చెప్పుకునే కెసీఆర్ కూడా తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నుంచి ఆంధ్రులపైన ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం చాలా వరకూ తగ్గించాడు. ఇక కెటీఆర్ అయితే సీమాంధ్రులతో పూర్తిగా కలిసిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ జాతీయ పార్టీలు అని చెప్పుకునే కాంగ్రెస్, బిజెపి నేతలు మాత్రం తమ రాజకీయ వెలుగు కోసం తెలుగు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఆ మధ్య జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయిన వెంటనే తెలంగాణా అసెంబ్లీలో సీమాంధ్రుల గురించి తప్పుగా మాట్లాడిన కాంగ్రెస్ నాయకులకు గట్టిగా గడ్డిపెట్టాడు కెసీఆర్. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సీమాంధ్రుల పైన ప్రేమ కురిపించి…ఎన్నికలవగానే ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకులను విమర్శించాడు కెటీఆర్. ఇప్పుడు కిషన్‌రెడ్డి కూడా సీమాంధ్రలను అవమానించేలా మాట్లాడాడు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలంగాణా ఉద్యోగులు అవమానాలు భరిస్తున్నారని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చాడు. ఆ ఉద్యోగుల పేర్లేంటి? ఆంధ్రప్రదేశ్‌లో వారు ఏ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నారు? లాంటి వివరాలు మాత్రం ఏమీ చెప్పలేదు. అసలు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న ఎంతమంది తెలంగాణా ఉద్యోగులు కిషన్‌రెడ్డిని కలిశారు. ఏం అవమానాలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇలాంటి చౌకబారు మాటలతోనే కదా కిషన్‌రెడ్డి…రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల మనసుల్లో విషబీజాలు నాటారు. ఒకవేళ కిషన్‌రెడ్డి చెప్పినట్టుగా ఒకరిద్దరు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నా…ఆ విషయాన్ని తెలంగాణా అసెంబ్లీలో ప్రస్తావించి తెలంగాణా ప్రజలందరికీ తెలిసేలా చేయాలా? ఇప్పుడిప్పుడే మానిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులకు అయినా గాయాలను మళ్ళీ రెచ్చగొట్టాలా? ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన తెలంగాణా ప్రజలకు ద్వేషం పెరిగేలా చేయాలా? ఆ మాటకొస్తే తెలంగాణా రాష్ట్రంలో ఇబ్బుందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఎవ్వరూ లేరా?
జాతీయ పార్టీ నాయకులు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మీరే రాజకీయ పబ్బం కోసం విద్వేషాలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నప్పుడు….కష్టాన్ని నమ్ముకునే బ్రతికే సామాన్యులను ఇబ్బందిపెట్టాలనే అల్పబుద్ధి, నీచ బుద్ధి ఉన్న ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు కిషన్‌రెడ్డిగారు. ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా కూడా అలాంటి మూర్ఖులు చాలా మందే ఉన్నారు. మీరు మాత్రం దయచేసి అలాంటి అథమ స్థాయి ఆలోచనలు ఉన్న మనుషులకు అసెంబ్లీ వేదికగా ఆయుధాలివ్వకండి. మీ మాటలను ఆయుధాలుగా చేసుకొని ఏదో జరిగిపోతుందన్న భయాందోళనలను, విద్వేషాలను రెచ్చగొట్టే బాపతు జనాలు ఎంతమంది ఉంటారో మీకు తెలుసా కిషన్రెడ్డీ? తెలంగాణా రాష్ట్ర ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు కిషన్‌రెడ్డి. చేతనైతే ఆ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తండి. ఓట్ల రద్దు నిర్ణయం తర్వాత నుంచి టీఆర్ఎస్తో ఎప్పుడెప్పుడు పొత్తుపెట్టుకుందామా? మంత్రి పదవులు అనుభవిద్దామా అని ఉవ్విళ్ళూరుతున్నారు కాబట్టి ఆ పని ఎలాగూ చేయలేరు. అలాగని చెప్పి తెలంగాణా ప్రజల ప్రేమ కోసం సీమాంధ్ర ప్రజలను విలన్స్‌గా చిత్రీకరించే 2014కి ముందు టీఆర్ఎస్ విధానాలను ఫాలో అవుతానంటే ఎలా కిషన్రెడ్డీ? జాతీయ భావాలు గల జాతీయ పార్టీనేతని…..అందునా దేశభక్తికి బ్రాండ్ అంబాసిడర్స్‌గా ముద్రవేయించుకోవాలని తహతహలాడుతున్న పార్టీ నాయకులు మీరు. అలాంటిది భారతీయ సోదరుల మధ్య విభేదాల సృష్టించే మాటలు మీ నోటి నుంచి రావొచ్చా? అది అదే……ఇది ఇదే……..అంతా రాజకీయమే అంటారా? అయితే కానివ్వండి. సీమాంధ్రలో మీ పార్టీ భాగస్వామ్యంలో నడుస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించండి చూద్దాం.