పురుషాధిక్య సమాజం మనది. ఆఖరికి ఇంటి పేరు కూడా `నాన్న`ని గుర్తు చేసేదే. అలాంటిది అమ్మ తరవాతే ఎవరైనా అని చెప్పి, ఆ మాటని అక్షరాలా నిజం చేసిన చక్రవర్తి కథ గౌతమి పుత్ర శాతకర్ణి. ఆయన కథనే క్రిష్ – బాలకృష్ణలు కలసి సినిమాగా తీశారు. ఈ సినిమా ప్రమోషన్లను చిత్రబృందం కథకు, అందులో విలువలకు తగ్గట్టుగానే చేస్తోంది. ప్రతీనటుడు, సాంకేతిక నిపుణుడి ఇంటిపేరు స్థానంలో అమ్మ పేరు పెట్టి.. `గౌతమిపుత్ర శాతకర్ణి` టైటిల్‌కి, ఆయన ఆలోచనలకు న్యాయం చేస్తోంది. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా తన జీవితంలో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకొన్నారు. ఇక మీదట తనని నందమూరి బాలకృష్ణ అని కాకుండా బసవతారక పుత్ర బాలకృష్ణగానే పిలవమని అభిమానుల్ని కోరుకొన్నారు. ఇది నిజంగానే ఓ అపూర్వ ఘట్టం. సినిమా, అందులో తాను పోషించిన పాత్ర ఓ నటుడిపై ఇంత ప్రభావం చూపిస్తుంది అనడానికి ఇది నిలువెత్తు నిదర్శనం.
ఒక్క బాలకృష్ణ మాత్రమే కాదు. చిత్రబృందంలో చాలామంది ఇలాంటి నిర్ణయమే తీసుకొన్నారని తెలుస్తోంది. ఇకమీదట అమ్మ పేరు ప్రస్తావిస్తూ తమని పిలవాల్సిందిగా.. వాళ్లూ కోరుకొంటున్నారు. ఇంతకంటే… ఓ సినిమాకి దక్కే గౌరవం, ఓ సినిమా వల్ల దక్కిన ప్రయోజనం ఇంకేముంటాయి?? బాలకృష్ణ ఈ కథని. ఈ పాత్రని ఎందుకు ఒప్పుకొన్నాడో తెలీదుగానీ… ఇప్పుడు మాత్రం తన నిర్ణయానికి తగిన న్యాయం జరుగుతోందనిపిస్తోంది. తన అభిమానులకు ఓ గొప్ప సందేశం ఇవ్వడానికి, గొప్ప సంకేతం పంపడానికి గౌతమి పుత్ర శాతకర్ణి పాత్ర, ఈ సినిమా ఓ వేదికగా నిలిచింది. అమ్మనీ, ఆమె పేరునీ గౌరవిస్తూ బాలయ్య తీసుకొన్న ఈ నిర్ణయం నిజంగా అందరినీ ఆలోచింపజేచేసేదే. హీరో పేరు చెబితే గొంతులు, చొక్కాలూ చించుకొని, విలువైన పాలని కటౌట్లపై అనవసరంగా ధారబోస్తూ ఇదే వెర్రి అభిమానం అనిపించుకొంటున్న తరుణంలో.. బాలయ్య ఓ చక్కటి సందేశాన్ని పంపిస్తున్నాడు. ఇకమీదట బాలయ్య అభిమానుల ఇంటి పేర్లు మారితే, అమ్మకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వగలిగితే ఆ ఘనత కచ్చితంగా ఆ ఘనత గౌతమిపుత్రదీ… మన బాలయ్యదీ.