ఇందుకే అంటారు… రాజకీయాల్లో శాశ్వత మిత్రులూ ఉండరూ శత్రువులూ ఉండరని! తెలుగుదేశం, కాంగ్రెస్… ఈ రెండు పార్టీల మధ్యా భావసారూప్యం సాధ్యమయ్యే పనేనా..? రెండూ భిన్న ధ్రువాలు. కలయిక కలలోనూ జరిగేది కాదు. ఓ రకంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకతలోంచి. అలాంటిది రెండు పార్టీలూ ఒకే తాటిపైకి రావడం పగటి కలే అనిపిస్తుంది. కానీ, ఈ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన తరుణమిది.
ఇక, తెలంగాణలో అధికార పార్టీ తెరాస, భాజపా! కేంద్ర ప్రభుత్వంపై ఎప్పుడూ కస్సుబుస్సులాడే కేసీఆర్‌కీ రాష్ట్రంలో భాజపా నేతలతో సాంగత్యం సాధ్యమయ్యే పనేనా చెప్పండీ. అయితే, ఈ అభిప్రాయాన్ని కూడా మార్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య కొత్తగా చిగురిస్తున్న సయోధ్యకు శాసన సభ సమావేశాలు వేదికగా నిలుస్తున్నాయని చెప్పుకోవాలి.
తెలుగుదేశం – భాజపా ఈ రెండు మిత్ర పక్షాలన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ, తెలంగాణకు వచ్చేసరికి ఈ రెండు పార్టీలూ చెరోదారిలో పయనిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. శాసన సభలో తెలుగుదేశం వాదనకు భాజపా మద్దతు ఇవ్వడం లేదు. టీడీపీ లీడర్లు వాక్ అవుట్ చేస్తే.. భాజపా సభ్యులు కుర్చీల్లోంచి కదడలం లేదు! వాక్ అవుట్ చేస్తున్న సందర్భంగా భాజపా సభ్యులను టీడీపీ నేత రేవంత్ రెడ్డి పిలిచినా కూడా వారు పట్టించుకోకపోవడం విశేషం.
సభలో తాజాగా చోటు చేసుకున్న ఫీజు రీఎంబర్స్మెంట్ చర్చ విషయంలోనూ రెండు పార్టీలో చేరో దారి పట్టాయని చెప్పాలి. కేసీఆర్ ప్రసంగంపై భాజపా నాయకుడు కిషన్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేస్తే… రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు! ఈ పథకం అమలులో కేసీఆర్ సర్కారు ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. ఆ తరువాత, రేవంత్ బాటలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మాట్లాడటం విశేషం. ఇక, పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై మొదట్నుంచీ తెరాస సానుకూలంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
కేంద్రానికి కేసీఆర్ దగ్గరయ్యేందుకు పెద్ద నోట్ల రద్దును బాగానే వాడుకున్నారు. తెరాస, భాజపాల మధ్య అప్రకటిత దోస్తీ చిగురించింది. దీంతో కేసీఆర్ పొడగిట్టని తెలుగుదేశం నేతలు తమ మిత్రపక్షమైన భాజపాకి కాస్త దూరంగా జరగాల్సిన పరిస్థితి వచ్చింది! ఇప్పుడు శాసనసభలో కూడా ఇదే ప్రతిబింబిస్తోంది. మొత్తానికి, తెలంగాణ రాజకీయాల్లో పరస్పరం విభేదించే పార్టీలు ఒకటౌతున్నట్టున్నాయి, మిత్రపక్షాల మధ్య దూరాలు పెరుగుతున్నాయని చెప్పుకోవాలి.