బాహుబలి తరవాత.. అంతటి ఆసక్తి కలిగిస్తోన్న సినిమా… గౌతమి పుత్ర శాతకర్ణి. ఇదో తెలుగు చక్రవర్తి కథ కావడం. అదీ… బాలయ్య వందో సినిమాగా రూపుదిద్దుకోవడం, విజువల్ ఎఫెక్ట్స్‌కీ, యుద్ధాలకూ ప్రాధాన్యం ఉండడంతో తెలుగు చిత్రసీమ యావత్తూ ఈ సినిమాపై దృష్టి నిలిపింది. ఈ సినిమాకి ముందు నుంచీ పరోక్షంగా, ప్రత్యక్షంగా సపోర్ట్ చేసుకొంటూ వస్తున్నాడు ఎస్.ఎస్.రాజమౌళి. టీజర్, ట్రైలర్ చూసి… క్రిష్‌ని అభినందించాడు. అంతేకాదు.. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎలా వ్యవహరించాలో కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాడు. బాహుబలికి పనిచేస్తున్న వీఎఫ్ఎక్స్ టీమ్… శాతకర్ణికీ సహాయం చేసిందన్నది లేటెస్ట్ టాక్. అందుకే క్రిష్ కూడా కృతజ్ఞత చూపించాలనుకొంటున్నాడు. రాజమౌళి అండ్ టీమ్‌కి ప్రత్యేకంగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాని ప్రదర్శించాలని క్రిష్ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం.
ఏ సినిమా విడుదలైనా.. తొలిరోజున తన కుటుంబ సభ్యులతో కలసి చూడడం రాజమౌళి అలవాటు. సినిమా నచ్చితే… తన ట్విట్టర్ ద్వారా ప్రోత్సహిస్తాడు కూడా. గౌతమి పుత్ర సినిమానీ తొలి రోజు థియేటర్లో కూర్చుని ఎంజాయ్ చేయాలని రాజమౌళి అండ్ టీమ్ భావిస్తోంది. అయితే అంతకంటే ముందే రాజమౌళికి ఈ సినిమా ప్రత్యేకంగా చూపించాలని క్రిష్ భావిస్తున్నాడు. ఈ విషయమై రాజమౌళితోనూ మాట్లాడాడట. ‘మీకు ఆసక్తి ఉంటే… ఈ సినిమాని ప్రత్యేకంగా చూపిస్తా..’ అని అడిగాడట. అయితే రాజమౌళి మాత్రం ”థియేటర్లో చూస్తేనే బాగుంటుంది.. నాకు అదే అలవాటు, ఈ సినిమాని కూడా థియేటర్లోనే చూస్తా… ”అని బదులిచ్చినట్టు తెలుస్తోంది. అంటే 12వ తేదీన ఫస్ట్ డే. ఫస్ట్ షో చూడ్డానికే రాజమౌళి మొగ్గు చూపించాడన్నమాట. చివరి నిమిషంలో రాజమౌళి నిర్ణయం ఏమైనా మారుతుందేమో చూడాలి.