కొత్త రాష్ట్రం తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. సంపన్న రాష్ట్రంగా పలు అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు దండిగా నిధులను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. వేగంగా అభివృద్ధి కోసం ప్రణాళికలు రచించి అమలుచేస్తోంది. ఈ ప్రయత్నం ఫలిస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. తెలంగాణ వృద్ధి రెండంకెల్లో ఉందని ఆయన చెప్పారు.
మంత్రి చెప్పిన వివరాల ప్రకారం, 2016-17 మొదటి ఆరు నెలల్లో తెలంగాణ జి.ఎస్.డి.పి. 10.2 శాతంగా నమోదైంది, ఇది జాతీయ సగటు 7.2 శాతం కంటే ఎక్కువ. ఆవిర్భవించిన రెండున్నరేళ్లలోనే రాష్ట్రం వృద్ధి రేటు విషయంలో గణనీయ పురోగతి సాధించింది. సంపన్న రాష్ట్రంగా ఉన్న వెసులుబాటును కేసీఆర్ ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది.
తెలంగాణ గ్రామీణ, వ్యవసాయ రంగాలకు ఆయువు పట్టులాంటి చెరువుల వ్యవస్థను పటిష్టం చేస్తోంది. మిషన్ కాకతీయ విజయవంతమైతే రైతు ఆత్మహత్యలు కూడా తగ్గుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మిషన్ భగీరథతో పాటు రైతు రుణ మాఫీ పైనా ప్రభుత్వానికి భారీగానే ఖర్చవుతోంది. సంక్షేమ రంగంలో పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న రాష్ట్రం కూడా ఇదేనని ప్రభుత్వం సగర్వంగా చెప్పుకుంటోంది.
అయితే రైతు రుణమాఫీని విడతల వారీగా అమలు చేయడం వల్ల పెద్దగా ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదు. దీనివల్ల చాలా మంది రైతులకు మేలు కలగడం లేదు. కొత్త రుణాల మంజూరులో బ్యాంకుల వైఖరి కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఏకమొత్తంగా రుణమాఫీ చేసి ఉంటే రైతులకు ఎంతో మేలు జరిగేది. అలాగే ఆరోగ్యశ్రీ, పీజు రీయంబర్స్ మెంట్ వంటి వాటికి బకాయిల చెల్లింపులో తరచూ జాప్యం జరుగుతోంది. నీటిపారుదల ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం అవుతోంది. పక్కా ప్రణాళికతో పనిచేయకపోతే సంపన్న రాష్ట్రానికి ఆర్థికంగా చిక్కులు తప్పక పోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.