పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగిన సంగతి తెలిసిందే! నాబార్డు ఇచ్చిన రుణంతో ఇటీవలే కొన్ని పనుల్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేసి తీరతామని ఏపీ సీఎం ఎప్పుడూ చెబుతూ ఉంటారు! వచ్చే ఎన్నికల నాటికి పోలవరం పనులు దాదాపు చివరి దశకు తీసుకొస్తే… రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయ్యేల్లా ప్లాన్ చేసుకుంటున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఏపీలోని ప్రతిపక్ష వైకాపాతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా పోలవరం క్రెడిట్ గేమ్‌లోకి దిగుతున్నాయి. పోలవరం క్రెడిట్ అంతా తెలుగుదేశం ఖాతాలో పడకుండా తమ వాటాలను క్లెయిమ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
పోలవరంతో సహా రాష్ట్రంలో చేపడుతున్న చాలా ప్రాజెక్టు పనుల్లో అవినీతి చోటు చేసుకుంటోందని ఆరోపించారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. ఇదే విషయమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఒక లేఖ రాశారు. ప్రాజెక్టుల అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ప్రాజెక్టుల అంచనాలను ఇష్టం వచ్చినట్టు పెంచేస్తూ… ఆర్థికశాఖ అనుమతులు ఇవ్వకపోయినా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆమోదం పొందుతున్నారని రఘువీరా మండిపడ్డారు. ప్రాజెక్టుల దగ్గరే అవినీతిపై చర్చ చేపట్టేందుకు సర్కారు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
ఇదిలా ఉంటే… చంద్రబాబుకు ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇంకో లేఖాస్త్రం సంధించారు. పోలవరం ప్రాజెక్టును కేవీపీ అడ్డుకుంటున్నారంటూ మంత్రి దేవినేని చేసిన విమర్శల్ని ఆయన తిప్పికొట్టారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో 1980 నుంచి నేటి వరకూ ఎవరేం చేశారనేది బహిరంగ చర్చ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక, విపక్ష వైకాపా కూడా పోలవరం నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుంటోందని విమర్శలు చేస్తున్న సంగతీ తెలిసిందే.
విపక్షాల విమర్శల్ని తిప్పికొట్టేందుకు తెలుగుదేశం నాయకులు కూడా తగ్గడం లేదు. నిజానికి, విపక్షాల చేస్తున్న విమర్శల్ని పక్కతోవ పట్టించి వ్యక్తిగత ఆరోపణలుకు దిగుతున్నారు. కేవీపీ లేఖాస్త్రం సంధించిన నేపథ్యంలో మంత్రి దేవినేని ఉమ మరోసారి విమర్శలకు దిగారు. వయసు పెరిగినంత మాత్రాన సరిపోదనీ, లేఖలు రాసేముందు వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. వైయస్ హయాంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన వారితో పోలవరంపై బహిరంగ చర్చకు మేం రావాలా అంటూ ఆయన మండిపడ్డారు. మొత్తానికి… ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోలవరం క్రెడిట్ క్లెయిమింగ్ గేమ్ షురూ అయింది. మా హయాంలోనే పోలవరం వచ్చిందని కాంగ్రెస్ చెబుతూ ఉంటే… మేమే పూర్తి చేస్తున్నామని తెలుగుదేశం అంటోంది. ఓ రకంగా ఈ చర్చను రానురానూ తెలుగుదేశం కూడా రాజేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే, చంద్రబాబు పాలనలో కాస్తొకూస్తో ఏదైనా పని జరుగుతోందంటే పోలవరం ఒక్కటే కదా!