ఫిరాయింపులు అంటే అర్థమేంటీ… ఒక పార్టీ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగానో లేదా ఎంపీగానో గెలిచి, మరో పార్టీలో చేరడం! పదవికి రాజీనామా చేయకుండానే వేరే పార్టీలో కొనసాగడం, పదవులుఏ పొందడం! తెలంగాణలో చాలామంది కాంగ్రెస్ నేతలు తెరాస తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నల్గొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఫిరాయించారు. అయితే, తెరాసలో చేరుతున్న రోజునే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. కానీ, ఫిరాయింపు నేతలతో రాజీనామాలు చేయించి, ఉప ఎన్నికలకు వెళ్లేంత ధైర్యం తెరాసకు లేకుండాపోతోంది. అలాగని, ఫిరాయించిన నేతలపై చర్యలు తీసుకునేంత స్వేచ్ఛ శాసన సభ స్పీకర్‌కు కూడా లేకుండాపోతోంది! అయితే, తన ఫిరాయింపునకు సంబంధించి తాజాగా గుత్తా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.
తాను ప్రస్తుతం అధికార పార్టీ తెరాసకు మద్దతు ఇస్తున్నానని గుత్తా చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై తనకు నమ్మకం ఉందనీ, తెరాస చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షించాయనీ, అందుకే తెరాసకు మద్దతు ఇస్తున్నానని ఆయన చెప్పారు. అంతేగానీ, తాను ఇంకా తెరాసలో చేరలేదని గుత్తా చెప్పడం విడ్డూరం! ఇంకా తెరాసలో చేరనప్పుడు తన ఎంపీ పదవికి రాజీనామా అనే ప్రశ్నే ఉండదన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా రాజీనామా చేయాలంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనను డిమాండ్ చేస్తూ ఉండటం హాస్యాస్పదం అన్నారు. టి.ఆర్.ఎస్.కు తాను మద్దతు మాత్రమే ప్రకటించానని గుత్తా చెప్పారు.
గతంలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన గుత్తా… ఇప్పుడు ఇలా మాట మార్చేయడం ఎంతవరకూ కరెక్ట్? ఆయన ఇంకా తెరాసలో చేరలేదట… మంత్రి పదవి ఇస్తే తీసుకునేందుకు సిద్ధపడ్డ గుత్తా తెరాసలో చేరలేదనొచ్చా..? గులాబీ కండువా కప్పుకుని, కేసీఆర్‌కు ఒంగిఒంగి దండాలు పెట్టాక కూడా తెరాసలో చేరనట్టా..? ఒకవేళ ఆయన తెరాసలో చేరకపోతే… ఈ మధ్య పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ తరఫున ఆయన ఎందుకు మాట్లాడలేదు? కాంగ్రెస్ గ్యాలరీలో కూర్చోవడానికి కూడా ఆయన ఇష్టపడకుండా పార్లమెంటు లాబీల్లోనే చక్కర్లు కొట్టారు. రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించడమే ఒక కుసంస్కారం. దాన్ని సమర్థించుకోవడం కోసం ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం సీనియర్ నేతలైన గుత్తా లాంటివారికి సరైంది కాదు! ఇవన్నీ ప్రజలకు అర్థం కావని అనుకుంటున్నారో… పట్టించుకోవడం లేదని భ్రమలో ఉన్నారో ఏమో!