‘స్టార్’ నుండి ‘యాక్టర్’ గా మారడం అంత సులభం కాదు. మెగా’స్టార్’ చిరంజీవి విషయంలో ఇది స్పష్టంగా కనబడుతుంది. తెలుగు సినిమా స్టామినాని ఒక్కసారిగా వందమెట్లక్కించి హీరో చిరంజీవి. స్టార్ డమ్ లో ఆయన ఎవరెస్ట్. డ్యాన్సులు, ఫైటింగ్స్ లో ట్రెండ్ సెట్టర్. వీటన్నిటికిమించి మెగా స్టార్ మెగా ‘నటుడు’. అయితే ‘స్టార్’ ఇమేజి ఆయనలోని నటుడ్ని డామినేట్ చేసిందని చెప్పకతప్పదు. చిరంజీవి సినిమా అంటే ఇలానే వుండాలి అని అభిమానులు బలంగా ఫిక్స్ అయిపోయారు. చిరు సినిమా అంటే అంచనాలు ఆకాశానికి అంటుతాయి. చిరంజీవి సినిమా అంటే ఫైట్లుండాలి, డాన్సులుండాలి, మసాలా వుండాలి, కామెడీ వుండాలి… వెరసి ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ కావాలి. ఇదీ చిరు సినిమాపై అభిమానులకు వుండే అంచనా.
చిరంజీవి కూడా అభిమానుల అభిమతంకు తగ్గట్టే సినిమాలు చేసుకుపోయారు. కమ్మర్షియల్ సినిమానే ఆయన కెరీర్ కుంభ బాగంగా సాగింది. మధ్యలో పారలల్ సినిమా చేయడానికి ప్రయత్నించారు. ‘రుద్రవీణ’, ‘స్వయంకృషి, ‘ఆపద్బాంధవుడు’.. లాంటి కళాత్మక చిత్రాలు చేశారు, ఇందులో చిరంజీవి నటనా కౌశలం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దురదృష్టం ఏమిటంటే.. ఈ సినిమాలు ఆయన మెజార్టీ అభిమానులకు నచ్చలేదు. చిరంజీవిని డీగ్లామరైజ్డ్ పాత్రల్లో చూడడం ఆయన అభిమానులకు రుచించలేదు. దీని తర్వాత మళ్ళీ అలాంటి సినిమాల జోలికి పోలేదు చిరంజీవి. అభిమానుల అభిరుచికి తగ్గట్టే.. ‘పక్కా కమర్షియల్’ ఛట్రంలోనే సినిమాలు చేసుకుపోయారు.
ఇప్పుడు మెగాస్టార్ రీఎంట్రీ ఇస్తున్నారు ఖైధీ నెంబర్ 150తో. తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తికి రీమేక్ ఇది. తెలుగు వెర్షన్ కి వచ్చేసరికి చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్లు కంప్లీట్ గా మార్చేశారని అర్ధమౌతుంది ట్రైలర్లు చూస్తుంటే. లక్ష్మి రాయ్ ఐటెం సాంగ్ అంట, బ్రహ్మనందం కామెడి అంట, అలాగే రూలు ప్రకారం ఆరు పాటలు. ఇది చాలు మెగాస్టార్ కోసం ఒరిజినల్ ను ఎంతలా మార్చేశారో చెప్పడానికి. మెగాస్టార్ ఎంట్రీ సినిమా కాబట్టి ఈ మాత్రం హంగామా వుండాల్సిందే. ‘కత్తి’ విషయానికి వస్తే ఓ సీరియస్ ఇష్యుపై నడిచే సినిమా ఇది. ఇక్కడ ఖైదీ ట్రైలర్స్ చూపిస్తున్నంత ‘హీరోయిజం’ లేదక్కడ. అయితే ‘మెగా’ సినిమా అంచనాల ప్రకారం .. అభిమానులకు కావాల్సిన ఫైట్లు, డాన్సులు, మసాలా, కామెడీ.. ఇలా అంతా ఇరికించేసినట్లు వున్నారు దర్శకుడు వినాయక్. మెగాస్టార్ అభిమతం కూడా ఇదే. ముందు ఆయన అభిమానులు సంతోష పరచాలి.
ఇక్కడి వరకు బావుంది. మెగాస్టార్ తర్వాత చేసే సినిమాల పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు చర్చ. మెగాస్టార్ మాటలు వింటుంటే ‘స్టార్’ డైలోనే ఫిక్స్ అయిపోయారనిపిస్తుంది. మొన్నోసారి మాట్లడుతూ.. ”గబ్బర్ సింగ్’ లాంటి సినిమా చేయాలని వుందన్నారు. ‘కిక్’ సినిమా నచ్చింది. అలాంటి పాత్రలో తనను చూసుకోవాలని వుందని సెలవిచ్చారు. ఈ మాటలు చాలు మెగాస్టార్ మూడ్ ని చెప్పడానికి.
అయితే ఇలాంటి గబ్బర్ సింగ్ లు కిక్కు లు గురించి అలోచించాల్సిన అవసరం ఆయనకు లేదనే చెప్పాలి. ఎందుకంటే.. ఆయన చూసినన్ని కమర్షియల్ సక్సెస్ లు ఎవరు చూశారు గనక. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఎప్పుడో ‘బాక్స్ బద్దలు’ కొట్టేశారయన. ఈ తరహ బాక్సాఫీసు పందెంలో ఎప్పుడో నెగ్గేశారు చిరంజీవి. మళ్ళీ ఇప్పుడు పాత పందెం గురించి అలోచించాల్సిన అవసరం ఏముంది?! అయితే చిరంజీవి మాత్రం ఇంకా ‘స్టార్’ భారాన్ని మోయడానికే మొగ్గుచూపుతున్నారనిపిస్తోంది. ముందే చెప్పుకున్నాం కదా.. స్టార్ నుండి యాక్టర్ గా మారడం అంత తేలిక కాదని. మరి, రీఎంట్రీలోనైనా చిరంజీవి తన ప్రయాణాన్ని కొత్త పుంతలు తొక్కిస్తారా ? అభిమానులు ఆయనకు ఆ అవకాశం ఇస్తారా? వెయిట్ అండ్ సీ.