శివ సినిమాతో రామ్ గోపాల్ వర్మ సృష్టించిన ట్రెండ్ విషయంలో బేదాభిప్రాయాలు ఉన్నాయి కానీ సినిమా పబ్లిసిటీ కోసం ఎన్ని జిమ్మిక్కులు చెయ్యొచ్చు, ఏ రేంజ్లో దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే ఎంత పబ్లిసిటీ వస్తుంది అనే విషయాల్లో మాత్రం నిజంగానే ట్రెండ్ క్రియేట్ చేశాడు వర్మ. ఈ విషయం మాత్రం అందరూ ఒప్పుకుంటారు. కాస్తంత ఎక్కువ మంది ప్రేక్షకులను అలరించిన సినిమా తీసి ఎన్నేళ్ళయ్యిందో తెలియదు…ఇన్ని సంవత్సరాలు ఓ హిట్ సినిమా లేకుండా జనాలకు, మీడియాకు గుర్తున్న ఇంకో డైరెక్టర్ వేరే ఎవరూ ఉండరు. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం మీడియావాళ్ళు, ప్రేక్షకులు తనను మర్చిపోకుండా ఎప్పటికప్పుడు పబ్లిసిటీ చేసుకుంటూ ఉన్నాడు.
ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్లో వర్మను పిచ్చి తిట్లు తిట్టాడు నాగబాబు. కానీ ఓవైపు చిరంజీవి, మరోవైపు బాలకృష్ణ మాత్రం పబ్లిసిటీ కోసం రామ్ గోపాల్ వర్మనే ఫాలో అవుతున్నారనే అనిపిస్తోంది. నెల రోజులుగా ఇరు వర్గాల అభిమానులు సోషల్ మీడియాలో తిట్టుకు చస్తున్నారు. ఇప్పుడిక రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో చిరంజీవి, బాలకృష్ణలిద్దరూ కూడా అభిమానుల మధ్య విభేదాలను మరింత రెచ్చగొడుతున్నారేమో అనిపిస్తోంది. ఇద్దరు హీరోలు కూడా సినిమా పబ్లిసిటీకి సంబంధించిన కార్యక్రమాలలో ఆయా సినిమాలలో ఉన్న డైలాగులను చెప్తున్నారు. కానీ ఆ చెప్తున్న డైలాగులన్నీ కూడా ఆ సినిమాల్లో ఉన్న హీరో క్యారెక్టర్స్ కంటే కూడా చిరంజీవి, బాలకృష్ణలకే ఎక్కువ యాప్ట్ అవుతున్నాయి. ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించడం కోసం మన దగ్గరున్న టాప్ రేంజ్ హీరోలందరూ కూడా వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్‌కి సంబంధించిన డైలాగ్స్ కూడా రాయిస్తూ ఉంటారు. ఇప్పుడు అవే డైలాగులను అభిమానుల సాక్షిగా చెప్పేస్తూ వాళ్ళను ఇంకాస్త రెచ్చగొడుతున్నారు. అభిమానులను అలరిస్తున్నారు అని ఎవరైనా చెప్పొచ్చు కానీ అలరించడం కంటే కూడా రెచ్చగొట్టడమే ఎక్కువగా ఉందన్న విషయం అర్థమవుతూనే ఉంది.
అభిమానుల సాక్షిగా ఖబడ్దార్ అన్న క్రిష్…ఆ తర్వాత మాత్రం రెండు సినిమాలనూ ఆదరించండి అని చెప్పాడు. అలాగే మెగా హీరోలందరూ కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యే అన్ని సినిమాలు హిట్టవ్వాలని చెప్పారు. కానీ ఆ మాటలు అభిమానుల చెవికెక్కేలోపే కొట్టేస్తున్నాం, రాననుకున్నారా, రాలేననుకున్నారా అంటూ ఇంద్ర సినిమాలో ఉన్న ఫ్యాక్షనిస్ట్ డైలాగ్ ఒక దాన్ని ఆవేశంగా చెప్పేశాడు చిరంజీవి. ఇక బాలకృష్ణకు చిరంజీవికి ఉన్నటువంటి శషబిషలు ఏమీ లేవు. ఖైదీ గురించి మాట్లాడిందే లేదు. కానీ యుద్ధ వీరుడి కథ కావడంతో ….ఆ కథలో ఉన్న డైలాగులను అభిమానుల ముందు చెప్పేస్తూ వాళ్ళ ఉన్మాదాన్ని పీక్స్‌కి తీసుకెళ్తున్నాడు.
మొత్తంగా చూసుకుంటే సంక్రాంతి హీరోలు కూడా రామ్ గోపాల్ వర్మకు ఏమీ తక్కువ కాదు. వర్మ అన్నా ఏదో ఒక కాంట్రవర్సియల్ విషయంపైన తన ‘వెరైటీ’ ట్వీట్స్ చేస్తూ పబ్లిసిటీ చేసుకుంటాడు. కానీ చిరంజీవి, బాలకృష్ణలు మాత్రం అభిమానులను మామూలుగా రెచ్చగొట్టడం లేదు. ఈ పబ్లిసిటీ అంతా రేపు ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్‌లో బాగానే ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. కానీ కలెక్షన్స్ కురిపించడం వరకూ ఆగితే ఫర్వాలేదు. ఆ గొడవలు సినిమా థియేటర్స్ దాటి వస్తేనే…..ఈ ఫిఫ్టీ ప్లస్, అనుభవజ్ఝులైన కథానాయకులు, గౌరవ రాజ్యసభకు, శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న నాయకులు కాస్తా విలన్స్ అవుతారనడంలో సందేహం లేదు. రెండు సినిమాల రిలీజ్‌లను యుద్ధంగా మార్చడంలో బాగానే సక్సెస్ అయ్యారు. ఇక ఈ యుద్ధం తాలూకూ ఫలితాలు, దుష్ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.