హమయ్య.. ఇన్నాళ్లకు అసలు విషయం చెప్పారు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు! అదేనండీ… ఈ మధ్య కేంద్రప్రభుత్వం పెద్ద నోట్లను రద్దుచేసింది కదా! ఎందుకు రద్దు చేసిందా అనే అంశంపై రోజుకో మాట మార్చుతూ వచ్చారు. మొదట్లో.. ఇది నల్లధనంపై యుద్ధం, బ్లాక్‌మనీ ఆటకట్టు అని చెప్పారు. ఆ తరువాత, ఉగ్రవాదం నిర్మూలన కోసం అన్నారు. ఆ తరువాత, లేదులేదూ ఇదంతా డిజిటల్ ఇండియా కోసం… నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహం కోసం అన్నారు. ఇంకా చాలాచాలా చెబుతూ ఉన్నారు. ఒకే విషయాన్ని మార్చిమార్చి, ఏమార్చి, ఏదో కొత్త అర్థాలు కూర్చి, ఎప్పటికప్పుడు కొత్తగా చెప్పడంలో సిద్ధహస్తుడు ఎవరైనా ఉన్నారంటే… ఏబీసీడీ నాలుగు ఆప్షన్లలోనూ వెంకయ్య నాయుడు పేరు రాసుకోవచ్చు! తాజాగా విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో పెద్ద నోట్ల రద్దు వల్ల ఏం జరుగుతుందో చెప్పారు (ఏం జరిగిందో చెప్పలేదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి).
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని సమూలంగా మార్చబోతున్నారని వెంకయ్య చెప్పారు. ఇప్పటికే నల్లధనంపై యుద్ధం ప్రకటించిన ప్రధాని మోడీ, సమీప భవిష్యత్తు మరిన్ని సంస్కరణలు చేపట్టబోతున్నట్టు ఆయన వివరించారు. వ్యవస్థలోని మొత్తం సొమ్మంతా బ్యాంకుల్లోకి వచ్చేసిందన్నారు. దీనర్థం ఏంటంటే… కరెన్సీ నోట్లన్నీ ఓపెన్‌గా ఉన్నాయనీ, ఎక్కడో పడుకున్న నోట్లూ, ఎక్కడో ఏడుస్తున్న నోట్లూ ఇవన్నీ బయటకి వచ్చాయన్నారు. అన్ని రకాల సేవల్నీ ఆన్‌లైన్‌లోని తీసుకుని రావడం ద్వారా.. ప్రజలు లైన్లో నిలబడే అవసరం ఉండదన్నారు. తప్పు చేసినవారు మాత్రం ఫైరింగ్ లైన్‌లో ఉన్నట్టే అని వెంకయ్య అన్నారు.
పరిస్థితులపై పంచ్‌లు వేసుకుంటూ పోతే.. వినడానికి సొంపుగా ఉండొచ్చు కానీ, సామాన్యుల బతుకుల్లో ఎలాంటి మార్పులూ రావు. అన్ని సర్వీసులూ ఆన్‌లైన్ చేసేస్తే.. ప్రజలు లైన్లలో ఉండాల్సిన అవసరం లేదని వెంకయ్య మాంచి రైమింగ్‌లో చెప్పారు. ఆ సంగతి సరే… ఇప్పటికీ బ్యాంకుల ముందూ ఏటీఎమ్‌ల ముందూ ప్రజలు నిలబడే ఉంటున్నారే..! ఇదేనా మోడీ చేయాలకున్న సమూల మార్పు? తప్పు చేసినవారు ఫైరింగ్ లైన్లో ఉంటారని వెంకయ్య మాంచి టైమింగ్‌లో చెప్పారు. కోట్లకు కోట్లు రుణాలు ఎగేసి.. బార్డర్ లైన్ దాటేసి పారిపోయిన బడా బాబుల విషయంలో ఎందుకు స్పందన ఉండటం లేదు..? బ్యాంకుల్లోకి సొమ్మంతా వచ్చినంత మాత్రన సమూల మార్పులు ఎలా సాధ్యం..? అద్భుతాలు ఎక్కడి నుంచీ మొదలౌతాయి..? ఇంతకీ, నభూతో నభవిష్యతి అని గొప్పగా చెప్పుకుంటున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తరువాత ఏం సాధించాం..? ఇలాంటి ప్రశ్నలకు వెంకయ్య నుంచీ సమాధానాలు రావు. ఎంతసేపూ ప్రాసలకోసం పాకులాట, పంచ్‌లైన్ల కోసం వెతుకులాట. భాషాడంబరం తప్పితే… బాధ్యత ఆయన మాటల్లో ధ్వనించిన సందర్భాలు ఈ మధ్య ఎన్నడైనా విన్నామా..?