ఎలాంటి ప్రతికూల పరిస్థితులను కూడా తమకు అనుకూలంగా మార్చుకోవడం కొందరికే సాధ్యమయ్యే పని. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు ఇబ్బందులకు చేసింది. ఈ రద్దు కేంద్రం సాధించిన విజయమో ఇంకేదో తేల్చుకోలేని పరిస్థితిలో భాజపా సర్కారు ఉంది! కానీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం కేంద్రం తీసుకున్న నిర్ణయంలోనూ తెలుగుదేశం సర్కారు విజయాన్ని చూపిస్తున్నారు. అది ఆయనే సాధ్యమైన విషయం. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం గురించి తనదైన శైలిలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మొదట్లో చాలామందికి అర్థం కాలేదన్నారు. ఇదో షాక్ ట్రీట్మెంట్ అనీ, చాలామందికి బాగానే దెబ్బ తగిలిందన్నారు. బ్యాంకర్లు ఈ పరిణామాన్ని ఊహించలేదన్నారు. చివరికి ఆర్బీఐకి కూడా ఇది పెనుసవాలుగా మారిందని చంద్రబాబు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని చెబుతూ… డిజిటల్ ఇండియాను ప్రకటించారని అన్నారు. దేశంలో నీతీ నిజాయితీలతో ఉండే రాజకీయ నాయకులెవరైనా ఈ నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే అన్నారు. ఎన్నికలు వస్తున్నప్పుడు డబ్బుల నోట్లను జేబుల్లో పెట్టుకుని ఓట్లను కొనేవారిని మనం చేశామనీ.. అలాంటివారు మెరుగైన పాలన ఎలా ఇవ్వగలరని ప్రజలను ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే అవినీతి పెచ్చరిల్లిందనీ, అంతా స్కాములమయమని చంద్రబాబు అన్నారు.
దేశంలో వేలిముద్ర ఆధారంగా బ్యాంకింగ్ సేవల్ని ప్రారంభించిన తొలి రాష్ట్రంగా కృష్ణా జిల్లా నిలుస్తుందనీ, ఇది మన తెలుగువారు సాధించిన విజయమని చంద్రబాబు చెప్పారు. నోట్ల రద్దు తరువాత క్యాష్ లెస్ విధానాలను ఎంతో పెంచగలిగామన్నారు. అంతేకాదు, బ్యాంకుల ముందు నిల్చున్నవారు కూడా కష్టాలకు సిద్ధమని అన్నారనీ, రేపటి భవిష్యత్తు కోసం ఈరోజు కష్టపడుతున్నామని చెప్పారన్నారు. అలాగే, తాను ఎన్నో గంటలు శ్రమించి బ్యాంకర్లతో మీటింగులు పెట్టి నగదు సమస్యను తగ్గించే ప్రయత్నం చేశానని అన్నారు! నగదు రహితంతోపాటు, వేలిముద్ర బ్యాంకింగ్ సేవలు అందించడంలో మనం విజయం సాధించామన్నారు.
కేంద్రంలోని భాజపా సర్కారు కూడా నోట్ల రద్దు తరువాత సాధించింది ఎలా చెప్పుకోవాలో చంద్రబాబును చూసి నేర్చుకోవాలి! ప్రధాని నిర్ణయాన్ని అందిపుచ్చుకున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రా విజయం సాధించిందట! వేలిముద్ర బ్యాంకింగ్ సేవల్లో మనమే నంబర్ వన్ అట! నోట్ల రద్దును ప్రథమంగా స్వాగతించిన ఘనతా మనదేనట. ఇవన్నీ వినడానికీ చెప్పుకోవడానికీ బాగున్నాయి. మొత్తానికి… కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఆంధ్రా ఇన్ని విజయాలు సాధించిందని చంద్రబాబు ఇలా చెప్పేవరకూ ఎవ్వరికీ అర్థం కాదేమో! మొత్తమ్మీద కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రభావం చంద్రబాబు నాయుడు మీద బాగానే పడినట్టుంది!