విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్రల్లో బిజీగా ఉన్నారు. చంద్రబాబు సర్కారు విధానాలను జనంలో ఎండగడుతున్నారు. ఇచ్చిన హామీల అమలుపై సూటిగా ప్రశ్నిస్తున్నారు. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగ భృతి, రుణమాఫీ, ప్రత్యేక హోదా… ఇలా తెలుగుదేశం సర్కారు వైఫల్యమైన అంశాలన్నింటిపైనా బహిరంగ సభలను వేదికగా మార్చుకుని విమర్శిస్తున్నారు. చంద్రబాబుపై ఎప్పటికప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే… ఎన్నికలు సమీపిస్తున్నాయేమో అనేంత దూకుడుగా జగన్ జనంలోకి వెళ్తున్నారు. ప్రజల నుంచి కూడా జగన్ సభలకు మంచి స్పందనే లభిస్తోంది. అయితే… ఈ స్పందనను మరో రెండేళ్లపాటు కొనసాగించే వ్యూహంతో జగన్ ముందుకెళ్తున్నారా లేదా అనేదే అసలు ప్రశ్న?
వైయస్సార్ సీపీలో మొదట్నుంచీ ఒక సమస్య ఉంది. అదేంటంటే, జగన్ ఎల్లప్పుడూ జనంలోనే ఉండాలన్నది కిందిస్థాయి నాయకుల ఆశ! జగన్ వస్తేనే జనం వస్తారు అనే ధోరణి ద్వితీయ శ్రేణిలో బలంగా నాటుకుపోయింది. అదే వాస్తవం. జగన్ వస్తున్నారు కాబట్టే, ఇప్పుడు జనం కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. జగన్ స్పీచ్‌లకు విశేష స్పందన లభిస్తోంది. అంతా బాగానే ఉంది. కానీ, ప్రజల నుంచి వస్తున్న ఈ ఊపును మరో రెండేళ్లపాటు నిలుపుకోవాలి. ఎన్నికల వరకూ ఈ జన స్పందనను కాపాడుకోగలగాలి. ఇది జరగాలంటే… ద్వితీయ శ్రేణి నాయకుల బాధ్యత పెరిగాలి. జగన్ వస్తారనగానే స్థానికంగా కొంత హడావుడి చేసి… సభ విజయవంతం కాగానే మళ్లీ సైలెంట్ అయిపోతే ప్రయోజనం ఉండదు.
గత ఎన్నికల్లో వైకాపాకు విశేష స్సందన వచ్చినా అధికారం దక్కకపోవడానికి కారణం… క్షేత్రస్థాయి వ్యూహరచన లేకపోవడమే. ప్రస్తుతం జరగాల్సింది ఇదే. జగన్ జనంలో ఉంటున్నారు… ఆ జనాన్ని జగన్‌తో ఉంచే వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి. ద్వితీయ శ్రేణి నాయకులకు బాధ్యతలు పెంచాలి. క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను మరింత యాక్టివ్ చేయగలగాలి. నాయకుల మధ్య బాధత్యల విభజన స్పష్టంగా ఉండాలి. అయితే, ప్రస్తుతం వైకాపా ఆ దిశగా పయనిస్తోందా..? జగన్ వ్యూహాత్మకంగా ఉన్నారా..? లేదంటే, సభలు నిర్వహించుకుంటూ వెళ్లిపోతున్నారా..?
తెలుగుదేశం పాలిట్రిక్స్‌ను తక్కువ అంచనా వెయ్య కూడదు. ఇప్పటికే ఫిరాయింపును ప్రోత్సహించి వైకాపాను నైతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేసింది. ఇంకోపక్క ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషించే ఇతర ప్రత్యామ్నాయ ‘పవర్స్’ను కూడా ప్రోత్సహిస్తోంది. ఈ తరుణంలో సభలకు మాత్రమే జగన్ పరిమితమైతే సరిపోదు. జనం తనవెంట ఉన్నారని నిరూపించుకుంటున్న మాత్రాన నాయకులు వెన్నంటి ఉంటారని భావించకూడదు. నాయకుల్ని కాపాడుకుంటూ ప్రజల నుంచి వస్తున్న స్పందనను కూడా భద్రంగా చూసుకోవాల్సిన సమయం ఇది. జగన్ సభలకు జనం వస్తున్నారు, ఆ జనాన్ని నిలుపుకోవడం కోసం జగన్ ఏంచేస్తున్నారు అనేదే ప్రశ్న?