పంట ఆదాయం చేతికొచ్చిన సందర్భంలో ఆరుగాలం కష్టపడే రైతన్నల కుటుంబాలు ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఆ ఆనందాన్ని పూర్తిగా ఆవిరి చేశారు మన పాలకులు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతు కుటుంబాలు ఎన్ని? వాటిలో సంతోషంగా ఉన్న కుటుంబాలు ఎన్ని అన్న గణాంకాలు తీయాల్సిన అవసరం కూడా లేదు. దేశాల నుంచి, నగరాల నుంచి సంక్రాంతి పండుగ కోసం గ్రామాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా అదే గ్రామంలో రెండు దశాబ్ధాల క్రితం ఎన్ని రైతు కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి? పంటలు ఎలా పండేవి? పాడి ఎలా ఉన్నది? దశాబ్ధం క్రితం పరిస్థితి ఎంతకు దిగజారింది? ఇప్పుడు పరిస్థితులు ఇంకా ఏ స్థాయికి పతనమయ్యాయి అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకున్నా తెలిసిపోయే పచ్చి నిజాలు అవి.
రైతుల రుణాలన్నీ మాఫీ చేశామంటారు, ఉపాథి హామీ పథకంతో వలసలు లేకుండా చేశామని చెప్తారు, రెయిన్ గన్స్‌తో పంటలు కాపాడామని పబ్లిసిటీ చేసుకుంటారు, నదుల అనుసందానం, ప్రాజెక్టుల నిర్మాణం అంటూ ఎన్నెన్నో….ఎంతెంతో గొప్ప గొప్ప మాటలు చెప్తూ ఉన్నారు. కానీ రాష్ట్రమంతా తిరిగే ఓపికలేకపోయినా….రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క గ్రామాన్ని అయినా సరే ఒక్కరోజు పాటు పరిశీలిస్తే చాలు….నిజాలన్నీ తెలిసిపోతాయి. అవే నిజాలు మన పాలకులకు కూడా తెలుస్తూనే ఉంటాయి. కానీ అద్దాల మేడల్లో, చలిమర గదుల్లో ఉంటూ….ఆకాశయానం చేస్తూ ప్రజల సొమ్ముతో కోట్లాది రూపాయల సౌకర్యాలను అనుభవిస్తున్న రాజకీయ నాయకులకు ఆ ప్రజల అభిమానం ఎలా పొందాలో బాగా తెలుసు. ఐదేళ్ళపాటు అవకాశం వచ్చినప్పుడల్లా రైతుల గురించి గొప్పగా మాట్లాడి వాళ్ళను మాయచేయడం, రైతే వెన్నెముక అంటూ మాటలతో మాయచేసి ఆ రైతుల వెన్నెముకనే విరిచేస్తున్నారు. కొత్త కొత్త పరిశ్రమలు తీసుకొస్తాం, లక్షలాది ఉద్యోగాలు తీసుకొస్తాం అని చెప్తూ దేశం మొత్తానికి ఉపాథిని, ప్రపంచానికే ఆహారాన్ని అందించగల స్థాయి ఉన్న మన వ్యవసాయ రంగాన్ని మాత్రం చంపేస్తున్నారు. లక్షలాది ఎకరాలను రైతుల దగ్గర నుంచి లాక్కుని….ఆ భూములను కార్పొరేట్ వ్యక్తులకు దారాధత్తం చేస్తున్నారు. ఆమ్యామ్యాల రూపంలో వస్తున్న వేలాది కోట్ల రూపాయలను ఎన్నికల సమయంలో అదే రైతుల ఓట్లు కొనడానికి ఉపయోగిస్తున్నారు.
అయినా ఆ రైతన్నలకు ప్రత్యామ్నాయం మాత్రం ఏం ఉంది? అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉన్న రెండు పార్టీలవీ ఒకటే రకం ఉచిత హామీలు……అందరూ అదే కార్పొరేట్ శక్తుల నుంచి ఫండ్స్ తీసుకునేవాళ్ళే. ఆ డబ్బుతో అధికారంలోకి వచ్చాక ఎవరైనా ఏం చేయగలరు? కార్పొరేట్ శక్తులకు కోట్లాది రూపాయల లాభం చేకూర్చాలి…….రైతన్నలను మాటలతో మాయ చేస్తూ ఉండాలి. సంక్రాంతి పండగ వచ్చినప్పుడల్లా రైతులందరూ సంతోషంగా ఉండాలని తాము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టుగా…..రైతుల కోసమే మేం బ్రతుకుతున్నాం అనే రేంజ్లో ఎవరి సొంత మీడియాలో వాళ్ళు ప్రచారం చేసుకోవాలి. సొంత మీడియాలేని వాళ్ళు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పి సంతృప్తి పడిపోవాలి. నాయకులందరూ చేస్తున్నది ఇదే. దశాబ్ధాలుగా జరుగుతున్న తంతు ఇదే. 2019 ఎన్నికల విషయంలో కూడా నాయకుల తీరు ఇలానే ఉంటుంది అనడంలో సందేహం లేదు. అందుకే నాయకులను నమ్ముకోవడం వేస్ట్……కనీసం వ్యక్తులుగా మనమైనా సంక్రాంతి పండగలకు గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళతో ఆనందాన్ని పంచుకోవడంతో పాటు వాళ్ళ కోసం ఏమైనా చేయగలమా అన్న కోణంలో కూడా ఆలోచిద్దాం…….గోదావరి జిల్లాల రైతులు కూడా వ్యవసాయం దండగ అనే అభిప్రాయానికి వచ్చే పరిస్థితులు ఉన్నాయంటే అది మనలో ఎవ్వరికీ మంచిది కాదు. ఊర్లకు వెళ్ళినవాళ్ళందరూ కూడా కనీసం రైతుల వెతలు, సమస్యలు, కష్టాలను అయినా స్మార్ట్ ఫొన్స్లో రికార్డ్ చేసి మన పాలకుల పైన ఒత్తిడి వచ్చేలా చేద్దాం……అందరూ కలిసి తలా కొంచెం డబ్బులు వేసుకుంటే అయ్యే చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చేద్దాం……ఒకటని ఏముంది? మన స్థాయిలో మనకు చేతనైనది ఏదైనా చేద్దాం……రైతన్నలకు కూడా జీవితంపైన కాస్తంత ఆశ…..ఆనందం మిగిలే పనులు ఏమైనా చేద్దాం…..అలా చేస్తే అయినా కేవలం సినిమా సందడికి, పందేలకు, తినడానికి, తాగడానికి పరిమితమైపోతున్న పండగ సంబరాలకు ఒక అర్థం పరమార్థం ఉంటుందేమో చూద్దాం……