గతంలో సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల ప్రచార వ్యవహారాలతో పోల్చితే ఈ సారి ఓ విషయం కాస్త ప్రత్యేకంగా నిలిచింది. సోషల్ మీడియా పుణ్యమాని లేని యుద్ధమేదో క్రియేట్ అయి థియేటర్స్ దగ్గర కొట్టుకునే వరకూ పరిస్థితులు వెళ్ళేలా కనిపించడంతో చిరంజీవి, బాలకృష్ణలిద్దరూ కూడా అలర్ట్ అయ్యారు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలూ బాగా ఆడాలని ఒకటికి పదిసార్లు చెప్పారు. చిరు, బాలయ్యలే కాకుండా అటు నందమూరి, ఇటు మెగా ఫ్యామిలీలో ఉన్న ఇతర హీరోలు కూడా సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలూ బాగా ఆడాలనే కోరుకున్నారు. శర్వానంద్ కూడా అదే విషయం చెప్పాడు. మరోవైపు దిల్ రాజుతో పాటు వినాయక్, క్రిష్‌లు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న ప్రముఖులందరూ కూడా అదే విషయం చెప్పారు.
ఫైనల్ రిజల్ట్స్ కూడా వాళ్ళందరూ కోరుకున్నట్టుగానే ఉన్నాయి. ఏ ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోలేదు. ఇనానిమస్‌గా బాగుందన్న పేరు తెచ్చుకున్న సినిమా ఒక్కటి కూడా లేదు. అలాగని బాగా లేని సినిమా కూడా ఏదీ లేదు. ఖైదీ నెంబర్ 150, గౌతమీ పుత్ర శాతకర్ణి, శతమానం భవతిలు మూడూ కూడా కొంతమంది చేత చాలా బాగున్నాయనిపించుకున్న సినిమాలే. కానీ ఎక్కువ మంది మాత్రం యావరేజ్ మార్కులే వేసేశారు. సినిమా బడ్జెట్, అమ్మిన లెక్కలతో కంపేర్ చేస్తే మూడు సినిమాల కలెక్షన్స్ కూడా ఇంచుమించుగా సమానంగానే ఉన్నట్టుగా లెక్క. అయితే ప్రేక్షకులకు మాత్రం కంప్లీట్‌గా మూడు డిఫరెంట్ జానర్ సినిమాలను ఆస్వాదించే అదృష్టం దక్కింది. మూడు సినిమాల్లోనూ పూర్తిగా డిసప్పాయింట్ చేసిన సినిమా కూడా ఏదీ లేదు కాబట్టి ఆ రకంగా కూడా పండగ రోజు సినిమాకెళ్ళిన ప్రేక్షకులందరూ హ్యాపీనే. బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం కాస్త ఇబ్బంది పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సినిమా లవర్స్ వరకూ మాత్రం ఈ సంక్రాంతి రోజులు కూడా పండగలాగే గడిచిపోయాయనడంలో సందేహం లేదు. అయితే సంక్రాంతి విజేత ఎవరో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.
నోట్ః నారాయణ మూర్తి సినిమా రిజల్ట్ ఇంకా తెలియదు.