గౌతమీపుత్ర శాతకర్ణి చూసి తెలుగు సినిమా అభిమానులు, బాలక్రిష్ణ అభిమానులు తెలుగు360 కి పంపిస్తున్న అనేక ఇ-మెయిల్స్ లో ఒకటి:
గౌతమీ పుత్ర శాతకర్ణి….
తెలుగు జగతిని ఒక్కసారి తట్టి లేపుతుంది..
మనస్సుని పలకరిస్తుంది…
తనువుని పులకరింపచేస్తుంది…!
మన జాతి పట్ల మనము మర్చిపోయిన బాధ్యతను గుర్తు చేస్తుంది…!
ఈ సినిమాను తప్పక చూడండి.. తెలుగు భాష పట్ల ఇష్టమున్న వ్యక్తి గా చెప్తున్నాను…మిమ్మల్ని నిరాశ పర్చదు.
అచ్చ తెలుగు నుడికారంలా … మచ్చలేని మమకారంలా అని ఏదో పాటలో వేటూరి వారు చెప్పినట్టు… చాలా సున్నితంగా, కధలో భాగంగానే చెప్పినా, మన చరిత్ర, గొప్పదనం, మన మనసుకి చాలా గట్టిగానే హత్తుకొంటుంది. ఈ సినిమా చూస్తూన్నంత సేపు కూడా తెలీకుండానే నా భాష, నా సంస్కృతి, నా జాతి, నా దేశం, నా ప్రాంతం, నేను నా దేశ ప్రాంత ప్రజలు, అంటూ సినిమాలో శాతకర్ణి తన వారి కోసం పడే కష్టంలో మనము కూడా బాగం అయిపోతాము. స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, కలర్ సింక్రనై జేషన్, రిపీట్ ఫుటేజెస్, గ్రాఫిక్స్ లేమి, ఇలాంటి సాంకేతిక విషయాలను కాసేపు పక్కనబెట్టి ‘స్టోరీ టెల్లింగ్’ అనే ఒక అద్భుత ప్రక్రియను దర్శకుడు మీకు చూపిస్తాడు. తాను చెప్పాలి అనుకొన్నది చెప్పేస్తూ, అదే సమయంలో మీ ఆసక్తిని మీరు కోల్పోకుండా, ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటూ బిగబట్టి చూస్తూ….ఇదే ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్ అంటే..! ఈ సినిమా చూడండి.. మీ ఫీలింగ్ అదే కాకపోతే నన్ను అడగండి..!
మీరు బాలకృష్ణని చూడరు….ఒక శాతకర్ణి ని చూస్తూ, అబ్బుర పడుతూ ఉంటారు! మీరు శ్రియా ని చూడరు… ఒక వాశిస్టీ మాత్రమే కనిపిస్తుంది…!! మొరాకోలో వున్న పురాతన కోట కనపడదు…కోసల రాజ్యం అనిపిస్తుంది.జార్జియా దేశపు పురాతన కోట అని మీరు అనుకోరు.సౌరాష్ట్ర లోని నహాపనా కొటలో శాతకర్ణి – నహాపనా మధ్య యుద్ధం కనిపిస్తుంది.కబీర్ బేడీ ఎవ్వరో మీకు తెలియదు. మీకు నహపనా అనే రాజు కనిపిస్తాడు. ఇక శాతకర్ణి రాజ్యం, నదీ తీరంలో అత్యంత హృద్యంగా వున్నట్టు కనిపించేది మధ్య ప్రదేశ్ లోని మహేశ్వరంలోని నర్మదా తీరం, జార్జియా లోని; కోట లోపల భాగాలు, తీసిన సీన్స్ చూస్తుంటే, శాతకర్ణి వున్న రెండవ బీసీ కాలం నాటి కోటలే కళ్ళ ముందు కనిపిస్తాయి.
దర్శకుడు ఎంచుకొన్న హిస్టారికల్ మాన్యుమెంట్స్ మన కళ్ళను కట్టి పడేస్తాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా, తక్కువ ఖర్చుతో, నిజంగా కట్టినవి, ప్రపంచంలో ఎక్కడో వున్న పురాతన కొటలని వెతికి పట్టుకొని, వాటితో మనకు 2nd century BC కాలంని చూపుతుంటే, దర్శకుడి ప్రతిభే కాదు, మనలో ఎక్కడో వున్న చరిత్రకారుడు కట్లు తెంచుకొని బయటకు వస్తాడు. కళ్ళు విప్పార్చుకొని చూస్తాము.
మొదటి యుద్ధం సముద్రంలో జరిగేది చూస్తుంటే, పదుల కొద్దీ చిన్న చిన్న తెరచాప పడవలు, ఆ పడవుల్లో ఒక దానిలో నుంచి ఇంకొక దానిలోకి దూకుతూ చేసే యుద్ధం… దర్శకుడు, 2200 సంవత్సరాల క్రితం కాబట్టి, అప్పుడు యుద్ధం ఇలాగే వుండేదేమోలే అన్న అభిప్రాయాన్ని మనకు కల్పిస్తాడు. ఎందుకంటే ఇంతకు ముందెప్పుడూ మీరు అలాంటి యుద్ధ సీన్ చిత్రీకరణ చూడలేదు కనుక. చివరి యుద్ధం, పచ్చిక బయళ్ళల్లో… అంతసేపూ యుద్ధం చూపినా నాకైతే ఇంకాసేపు యుద్ధం కొనసాగించి ఉంటే బాగుండునేమో అనిపించింది. అంత బాగా తీసారు.
ఇక… బాలకృష్ణ..! Why should Balakrishna not be given National Award this Time !?Atleast, honestly I got that feeling..!
సినిమా నుంచి వచ్చేసాక కూడా, మీకు శాతకర్ణి మనసులో మెదులుతూ ఉంటాడు, ఈ సినిమాని చూసిన తర్వాత. నవరసాలు గురించి చెప్పలేను కానీ, ఆ మొహంలో ‘రౌద్రం’ మాత్రం బహుశా అనితర సాధ్యం. యుద్ధ సన్నివేశాల్లో కావాల్సినా శౌర్య, రౌద్ర రసాలు, చాలా బాగా కనబరిచాడు. నాకైతే నచ్చిన కొన్ని సన్నివేశాలు, కొడుకుని తనతో పాటు గుర్రం మీద ముందు కూర్చో పెట్టుకొని, నహపనాని సైన్యం ముందు నిల్చుని, కొడుకు చేత ఏడు చేపల కధ చెప్పించుకొనే సన్నివేశం…… రెండవ , మూడవ యుద్దాల్లో , తన సేనలు ఓడిపోతుంటే దిగాలుగా గుర్రంపై కూర్చుని చూస్తుండిపోయే దృశ్యం, చివరి యుద్ధంలో గుడారంలో కూర్చుని పథక రచన చేస్తూ… మాట్లాడకుండా చూస్తుండిపోయిన క్షణాలు, బల్ల మీదున్న చదరంగం బోర్డు పై వున్న బొమ్మల్ని చెల్లాచెదురు చేసే సన్నివేశం …..ఇంకా చాలానే వున్నాయి.
Balakrishna has deffinitely outgrown himself in this movie. He has crossed by miles his usual performance level many times which is quite visible not to the discerning eye but to a casual viewer too..!
ఇక.. వాశిష్టీ గా శ్రియా…నిజంగా బాగా చేసింది. తను వున్న సన్నివేశాల్లో ఒక్కోసారి తన మంచి డైలాగ్స్ తో బాలకృష్ణని డామినేట్ కూడా చేస్తుంది. కానీ ఒక్కోసారి, ఏమి మాట్లాడినా రొమాంటిక్ హస్కీ వాయిస్ లా అనిపించే డబ్బింగ్ వాయిస్ పంటి కింద రాయిలా ఉంది.
ఈ సినిమాకి ప్రాణం మాటలు…! ఎక్కడా ఎక్కువ కాకుండా, చాల చక్కని తెలుగు మాటలతో, బుర్రా సాయి మాధవ్ ప్రాణం పోసాడు. ఒక పీరియడ్ చిత్రానికి, పూర్తి గ్రాందీక బాషా కాకుండా, వ్యావహారిక బాషా జోడించి చాలా ఆకట్టుకొంటాడు. ఈ మధ్య కాలం లో హిందీ వాళ్ళతో తెలుగుని కావాలనే అష్ట వంకర్లు తిప్పి పాటిస్తున్న తెలుగు పాటలు విన్న తర్వాత, ఈ సినిమా పాటలు చాలా బాగున్నాయి. ‘మృగ నయనా’.. పాట, సంగీతం, థిల్లానల అమరిక తో పాటుగా కలర్ సింక్రనైజేషన్ కూడా చక్కగా కుదిరింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ టెరిఫిక్. కానీ యుద్ధాల్లో కొద్దిగా హోరు ఎక్కువయ్యిందేమో..!
ఇక దర్శకుడు… ఇంత చెప్పిన తర్వాత, అతని గురించి మళ్ళీ చెప్పాలనుంటే, ఇప్పుడు రాసినంత రాయాలి..! మన పరిశ్రమకు ఆలోచించే ఒక మంచి దర్శకుడు లభించాడు.
ఇక చరిత్ర మార్చారు…తెలుగోడే కాదసలు, వక్రీకరణ…లాంటి విమర్శల్ని అస్సలు వినద్దు. చరిత్ర ఎవ్వరూ చూడలేదు. అందరూ విన్నదే. మనము, మన తెలుగు వాళ్ళు విన్న చరిత్ర ఇది. అమరావతి నుంచి ప్రారంభం అయిన శాతకర్ణి చరిత్ర ఇది. మన చరిత్ర. విమర్శించే వాళ్ళని కావాలనుంటే, తియ్యగలిగితే, అంత శక్తియుక్తులు ఉంటే, వాళ్ళ సినిమాని తీసికోమని చెప్పండి.
ఇది మా అమరావతి కథ.
మా తెలుగు వాడి కధ.
మా తెలుగు జాతి కథ.
మా తెలుగు పౌరుషం కథ
రుద్రమ్మ భుజ శక్తి, తిమ్మరుసు ధీయుక్తి,
శాతకర్ణి ప్రపంచ కీర్తి, కృష్ణ రాయల శత కీర్తి…
ఇవన్నీ అజరామరం.
వాటిని గుర్తు చేసుకోవడం మన ధర్మం….బాధ్యత.!
స్వస్తి.
Neelayapalem Vijay Kumar