ప్రతి దర్శకుడికి ఓ స్టయిల్ వుటుంది. అలాగే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకీ ఓ స్టయిల్ వుంది. కధలో, పాత్రలలో మరీ డ్రామా ఎక్కువగా కనిపించదు. చాలా నేచురల్ గా, నేటివిటికి తగ్గట్టు మన దగ్గర జరిగిన కధే, మనం చూసిన పాత్రలే కనిపిస్తుంటాయి శ్రీకాంత్ అడ్డాల చిత్రాల్లో. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుందా, బ్రహ్మోత్సవం.. చిత్రాలు ఇలానే సాగాయి. మన ఇంట్లో అమ్మ నాన్న, తాతయ్య, తమ్ముడు, పిన్ని, మావయ్య… ల పాత్రలు ఎలా వుంటాయో.. అలాంటి పాత్రలే అడ్డాల చిత్రాల్లో కనిపిస్తాయి. ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ”ఇది శ్రీకాంత్ అడ్డాల సినిమా” అని ఈజీగా చెప్పేయోచ్చు. అయితే ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల ముద్రనే పట్టేశాడు దర్శకుడు వేగేశ్న సతీష్. ‘శతమానం భవతి’ సినిమా చూస్తే అలానే అనిపిస్తుంది.
సంక్రాంతి కానుకగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘శతమానం భవతి’. చిత్ర యూనిట్ చెప్పినట్లు ఇది సంక్రాంతికి రావాల్సిన సినిమానే. పండగ వాతావరణం కనిపించిందీ సినిమాలో. అయితే అడుగడుగునా ఈ సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ముద్ర కనిపించింది. పాత్రలు, సంభాషణలు, ఎమోషన్స్.. ఇలా చాలా చోట్ల శ్రీకాంత్ అడ్డాల కనిపించాడు. పాత్రల మాటల్లో వినిపించాడు. జయసుధ, ప్రకాష్ రాజ్ ల పాత్రలు తీర్చిదిద్దన విధానం కానీ, హీరో క్యారెక్టర్ గానీ, మిగతా నటీనటుల పాత్రలు, సన్నివేశాలు.. ఇలా ప్రతీ చోట అడ్డాల మార్క్ కనిపించింది. నిర్మాత దిల్ రాజు అభిరుచి కూడా ఇదే. ఫ్యామిలీ డ్రామాలు ఆయనకు బాగా నచ్చుతాయి. శ్రీకాంత్ అడ్డాల తరహా సినిమాలైతే మరీనూ. అందుకే దిల్ రాజు ఈ కధకు ఇంప్రెస్ అయిపోయినట్లు వున్నారు. అయితే ఈ తరహా మార్క్ వేగేశ్న సతీష్ భవిష్యత్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడే చెప్పలేం కానీ,, మొత్తం మ్మీద ఓ ఫ్యామిలీ డ్రామా పండించగల మరో దర్శకుడు వచ్చాడనే భరోసా అయితే ఇండస్ట్రీకి వచ్చింది.